లాక్‌డౌన్ ఎఫెక్ట్ : రోజుకు 24 రిజిస్ట్రేషన్లే..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపధ్యంలో ఆస్తుల క్రయ విక్రయాలకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం షరతులతో కూడిన లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తారు. సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఆఫీసులు పని చేస్తున్నాయి. ఈ మధ్య సమయంలోనే లావాదేవీలు పూర్తి చేసుకోవాలి. అయితే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు కలిగిన ఆఫీసుల్లో […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపధ్యంలో ఆస్తుల క్రయ విక్రయాలకు అనుమతులు ఇచ్చారు. ప్రస్తుతం షరతులతో కూడిన లావాదేవీలు మాత్రమే జరుగుతున్నాయి. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 24 రిజిస్ట్రేషన్లు మాత్రమే చేస్తారు. సోమవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఆఫీసులు పని చేస్తున్నాయి. ఈ మధ్య సమయంలోనే లావాదేవీలు పూర్తి చేసుకోవాలి.
అయితే ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు కలిగిన ఆఫీసుల్లో మాత్రం 48 స్లాట్ల వరకు అనుమతిస్తారు. కేటాయించిన సమయంలోనే ఆఫీసుకు రావాలి. ఆన్ లైన్ లోనే ఇరుపక్షాలకు, సాక్షులకు పాసులు జారీ చేయనున్నారు. లాక్ డౌన్ కాలంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, పోలీసులు ఆపినా ఆ పాసులు చూపించొచ్చు. కొనుగోలుదార్లు, అమ్మకందార్లకు ఐదు నిమిషాల సమయమే కేటాయిస్తారు.
చెక్ చేసినా తర్వాతే..
ఆఫీసులోకి ప్రవేశించే ముందే ఇరుపక్షాలు, సాక్షుల గురించి పరిశీలించిన తర్వాతే అనుమతిస్తారు. ఇతరులెవరినీ లోపలికి అనుమతించరు. అలాగే గరిష్ఠంగా ఏడుగురికి మించి లోపలికి రావద్దని అధికారులు సూచించారు. బోటనవేలి ముద్రలు వేసేటప్పుడు తప్పనిసరిగా శానిటైజర్లు ఉపయోగించాల్సిందే.
వెంటనే స్కానింగ్
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కాగానే డాక్యుమెంట్లు స్కానింగ్ చేస్తారు. వెంటనే సంబంధిత వ్యక్తులకు అందజేయనున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో, ముందు ఎవరూ గుమికూడొద్దని నిబంధనలు విధించారు. అలాగే కార్యాలయాల్లో ఈసీలు, సీసీ కాపీలు జారీ చేయరు. ఎవరైనా మీ సేవా, ఆన్ లైన్ లోనే పొందాలి. మ్యాన్యువల్ గా జారీ చేయొద్దని ఉన్నతాధికారులు సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారు.