‘మరియమ్మ మృతి’లో ఆ ఎమ్మెల్యేలెక్కడ..?
దిశప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ లాకప్ డెత్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపట్ల యావత్ తెలంగాణ సమాజం స్పందించింది. పోలీసు స్టేషన్‌లో ఓ దళిత మహిళ మృతిచెందడం పట్ల సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడమూ తెలిసిందే. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పందించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఓ […]
దిశప్రతినిధి, నల్లగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసు స్టేషన్‌లో మరియమ్మ అనే ఎస్సీ మహిళ లాకప్ డెత్ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె మృతిపట్ల యావత్ తెలంగాణ సమాజం స్పందించింది. పోలీసు స్టేషన్‌లో ఓ దళిత మహిళ మృతిచెందడం పట్ల సాక్షాత్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. బాధ్యులపై చర్యలకు ఉపక్రమించడమూ తెలిసిందే. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పందించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
ఓ దళిత మహిళ అనుమానస్పదంగా పోలీసు స్టేషన్‌లో మరణిస్తే.. ఇప్పటివరకు స్థానిక ఎమ్మెల్యే కిశోర్ ఒక్క స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడంపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది. దీనికి తోడు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు అయిన తుంగతుర్తి(ఎస్సీ) నియోజకవర్గం నుంచి గెలిచి.. దళిత మహిళకు అన్యాయం జరిగితే.. కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గాన్ని అనుకుని ఉన్న మరో నియోజకవర్గం నకిరేకల్. అది సైతం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు. అక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సైతం మరియమ్మ మృతి పట్ల కనీసం స్పందించలేదు. ఓ దళిత మహిళకు అన్యాయం జరిగితే.. అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించకపోవడంపై పలువురు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఓ దొంగతనం కేసులో దర్యాప్తులో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం కోమట్లగూడకు చెందిన అంబడిపూడి మరియమ్మను అడ్డగూడూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజు మరియమ్మ కుమారుడు ఉదయ్‌కిరణ్, అతడి స్నేహితుడు వేముల శంకర్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో ప్రశ్నించడంతో రూ.1.35 లక్షలను వారి ద్వారా రికవరీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మిగిలిన రూ.65వేల కోసం గత శుక్రవారం మరియమ్మను పిలిపించి ప్రశ్నించగా ఆమె స్పృహతప్పి పడిపోయింది. ఆమెను పోలీసు వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది.
కాగా, ఈ విషయం బయటకు పొక్కకుండా సాయంత్రం వరకు గోప్యంగా ఉంచడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. సాయంత్రం విషయం బయటకు రావడంతో ఎస్సైని వివరణ కోరగా.. దొంగతనం కేసు విచారణలో పీఎస్‌కు తరలిస్తుండగా ఆవరణలోనే స్పృహతప్పి పడిపోవడం వల్ల భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయినట్లు పోలీసులు వివరించారు. కానీ, ఈ ఘటన వెనుక చాలా పెద్ద తతంగమే నడిచినట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు విపరీతంగా కొట్టడం వల్లే మరియమ్మ మృతి చెందిందని, మృతురాలి కుమారులను సైతం పోలీసులు విపరీతంగా కొట్టారనే ఆరోపణలు లేకపోలేదు.