థార్ ఎడారి..... ఓ అద్భుతం
మా రాజస్థాన్ ప్రయాణమే థార్ ఎడారి కేంద్రంగా ప్రణాళిక వేసుకున్నాము.
దిశ, వెబ్ డెస్క్ : మా రాజస్థాన్ ప్రయాణమే థార్ ఎడారి కేంద్రంగా ప్రణాళిక వేసుకున్నాము. కార్తీక పౌర్ణమి రోజులలో థార్ ఎడారి సౌందర్యాన్ని తనివి తీరా అన్ని కోణాలలో ఆస్వాదించాలని మా ప్రయత్నం. ఆ రోజు రానే వచ్చింది. జైసల్మెర్ నుంచి మా ప్రయాణం ఎడారి లోకి సాగింది. ముందుగా దారిలోనే ఉన్న బడాబాగ్ కు వెళ్ళాము. అది చిన్న కొండ మీద ఉన్న ఆనాటి రాజ్ పుత్ రాజుల సమాధులున్న చోటు. సమాధులను కూడా అంత కళాత్మకంగా నిర్మించడం వారికే చెల్లింది. రాజు, రాణి, కుమారులు, ఇతర కుటుంబ సభ్యుల కొరకు వేరువేరు పరిమాణంలో సమాధులున్నాయి. ప్రతి సమాధిలో ఆయా వ్యక్తుల వివరాలున్నాయి. ఇప్పటికీ రాజ వంశీయులలో ఎవరు చనిపోయినా అక్కడే సమాధి చేస్తారట. అలా నిర్మాణంలో ఉన్న ఒకటి రెండు సమాధులు కూడా అక్కడ చూసాము. స్థానికులను విచారించినప్పుడు తెలిసిన వివరాలు ఏమిటంటే వారి సంప్రదాయం ప్రకారం ముందుగా సమాధి చేసి, దాని పైన మరణించిన వ్యక్తి ఫోటోను ఉంచారు.దానిపైన ఒక నీటి కుండను ఉంచారు. దానిలోని నీళ్ళు బొట్లు బొట్లుగా ఆ సమాధి మీద పడుతున్నాయి. ఆ నీళ్ళు మొత్తం అయి పోయిన తరువాతనే ఆ సమాధికి మంటపం నిర్మిస్తారట. ప్రతి సమాధి పైకప్పు ఛత్రి ఆకారంలో ఉండడం వలన వాటిని ఛత్రి సమాధులు అని కూడా అంటారు. దానికి సమీపంలో ఉన్న జైన మందిరానికి వెళ్ళాము. పైన ఒక మందిరం దాని కింద మరో మందిరం ఉండడం విశేషం. దాని శిల్పకళా సౌందర్యం అద్భుతంగా ఉన్నది.
థార్ ఏడారి 85% భారత దేశంలో 15% పాకిస్తాన్ లో ఉంది. అందులోనూ 60% రాజస్థాన్ లో మిగిలింది పంజాబ్, గుజరాత్ లో ఉంది. విస్తీర్ణం 77000 చదరపు మైళ్ళు. థార్ ఎడారిని Great Indian Desert అనీ, Golden Desert అని కూడా పిలుస్తారు. ఎడారి అంటే ఎలాంటి పచ్చదనం లేకుండా ఉంటుందనే భ్రమలో ఉంటాము. కానీ థార్ ఎడారిలో అనేక రకాల ఎడారి మొక్కలతో పాటు గుబురుగా పచ్చగా పెరిగిన తుమ్మ చెట్లు కనిపించాయి. ఎడారిలో బలంగా వీచే గాలుల వల్ల ఇసుక దిబ్బల నుండి వచ్చే ఇసుకతో రైలు మార్గాలు, కంచెలు, పంట పొలాలు నిండిపోతాయట. దానిని అరికట్టడానికి ఎడారిలో పెరిగే చెట్లను విదేశాలనుంచి తీసుకు వచ్చి నాటారట. ముఖ్యంగా పెద్ద పెద్ద తుమ్మ చెట్లు ఎక్కువగా కనిపించాయి. వాటి వల్ల వర్షాలు పడి, పూర్వం ఉన్న నీటి కరువు ప్రస్తుతం అంతగా లేదని స్థానికులు చెప్పారు.
ఎడారిలో దారిలో మధ్యలో ఉన్న ఎలాంటి హోటల్లో మధ్యాహ్న భోజనం చేసే ఉద్దేశ్యం మాకు లేదు. ఏడాది గ్రామంలో ఏదో ఒక కుటుంబంలో వారితో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేయాలనేది మా కోరిక. మయూర్ టూర్ ఆర్గనైజర్ వైష్ణవ్ మేము ముందే చెప్పి ఉన్నందువల్ల అలాంటి ఏర్పాటు చేశాడు. అలా మేము సామ్ అనే ఎడారి గ్రామంలో ఒక ఇంటికి వెళ్ళాము. ఎండ తీవ్రంగా ఉన్నా ఇల్లు మాత్రం చాలా చల్లగా ఉంది. పసుపు రంగు ఇసుక రాయినే ఇంటి నిర్మాణానికి ఉపయోగించారు. ఇంటి పై కప్పుగా కూడా రాళ్ళనే వాడారు. ఎడారిలో ఉండే తీవ్ర లాలూవరణ పరిస్థితులను తట్టుకోవడానికి వీలుగా అలా నిర్మిస్తారని చెప్పారు. మేము వెళ్ళేటిప్పకి ఇంటి ఇల్లాలు మా కొరకు భోజనం తయారు చేయడంలో బిజీగా ఉంది. కాస్త విచిత్రంగా మరింత ఉత్సాహంగా ఆ ఇంటి పిల్లలు మాకు కొంచం దూరంలో మూగారు. టీచరును కావడం వల్ల వాళ్ళను చూడగానే నాకూ ఉత్సాహం వచ్చి పలకరించాను. చిన్నపిల్లలు సిగ్గుతో మురిపాలయ్యారు. పదోతరగతి చదువుతున్న ఊర్మిళ నా దగ్గరగా వచ్చి కూర్చుంది. తనతో హిందీలో ముచ్చట మొదలు పెట్టాను. తరువాత ఇల్లు చూడడానికి తనతో లోపలికి పోయాను. కాసేపటికి రమేశ్, అనిత, దినేశ్ ఇలా అందరూ చేరిపోయారు. వాళ్ళందరూ ఉత్సాహంగా వాళ్ళ బడి కబుర్లు చెప్పారు. వాళ్ళంతా చాలా చురుకుగా ఉన్నారు. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల, కళాశాల ఉన్నాయట. తరగతిలో సుమారు 35 మంది విద్యార్థులు ఉంటారట. రాజస్థానీ, ఇంగ్లీషు మీడియంలో బోధన ఉన్నదట. చుట్టు పక్కల గ్రామాల పిల్లలు కూడా అక్కడికి చదువుకోవడానికి వస్తారట. ప్రియాంక పన్నెండో తరగతి పూర్తి టీచర్ ట్రైనింగ్ కోసం కోచింగ్ తీసుకుంటానని చెప్పింది. ఆమె నాతో టచ్ లో ఉంది. పాఠశాల, కళాశాల రెండూ co Education కావడం నాకు సంతోషాన్ని ఇచ్చింది.
నాలుగు కాయగూరలతో ప్రత్యేకమైన స్వీటుతో రెండు రకాల రోటీలతో భోజనం సిద్ధం చేశారు. ఆ ప్రాంతంలో ఆలుగడ్డ విరివిగా దొరుకుతుంది కాబట్టి అది కూడా ఉంది. ఘుమ ఘుమ వాసనలతో నోరూరిస్తున్న శాకాహార భోజనం ... కావలసినంత ఆవునెయ్యి .. ... రుచికరమైన వంటకాలతో తృప్తిగా భోజనం ముగించాము. మొదటి ఇంటి ఇల్లాలు బసు మాతో కలవడానికి బిడియంపడినా తరువాత మేడమీదకు తీసుకువెళ్ళి బోలెడన్ని కబుర్లు చెప్పింది. ఈలోగా ఇరుగు పొరుగు స్త్రీలు కూడా వచ్చి చేరారు. వాళ్ళతో మాటామంతీ మాకు ఎన్నో కొత్తవిషయాలను తెలియజేసింది. వాళ్ళలో ఒక పెద్దావిడ ఉంది. ఆమె పేరు తీబాదేవి. ఆమెకు నలుగురు కొడుకులు. మేము భోజనం చేసింది ఆమె పెద్ద కొడుకు ఇంట్లోనే... అక్కడే వేర్వేరు ఇళ్ళలో ఉంటున్నారు ఆమె మిగతా కోడళ్లు కూడా అక్కడికి వచ్చారు. మగవాళ్ళు మాత్రమే పనికి వేళతారట. మహిళలు ఇంటిదగ్గరే ఉన్నారు. వ్యవసాయం, పశు పెంపకం ప్రధాన వృత్తులు. పుచ్చకాయ, చిక్కుడు, దోస లాంటివి పండుతాయి. వాళ్ళ ఇంటి దేవత కేతపాల్ దాడు. పిల్లలకు ఏడాది లోపల బడాబాగ్ లో ఉన్న కేత్పాల్ మందిరానికి తీసుకు పోయి, ఆ దేని బొమ్మ ఉన్న లాకెట్ ను మెడలో వేస్తారు. దానివలన ఆ పిల్లల భవిష్యత్తుకు భరోసా ఉంటుందని నమ్ముతారు. దాదాపు అక్కడ ఉన్న పిల్లలందరి మెడలో అవి ఉన్నాయి.
అక్కడి నుంచి మేము హిల్టన్ థార్ రిసార్టుకు చేరుకున్నాము. రాజస్థానీ సంప్రదాయ పద్ధతిలో యు వతీ యువకులు సంగీత వాయిద్యాలతో మాకు రేటు దగ్గరే స్వాగతం చెప్పారు. అక్కడ వసతి గూడారాల్లో... కాంపింగ్ చేసే టెంట్స్ అనుకున్నాను. కానీ కాదు. డబుల్ కాట్ బెడ్, అటాచ్డ్ బాత్రూం, వేడి నీళ్లు, సకల వసతులతో ఉన్న పక్కా గుడారం. అందమైన రాజస్థానీ చిత్రకళతో ఉన్న పైకప్పు కూడా దళసరి బట్ట తోనే ఉంది. మాకు మంచినీళ్ళు, టీ తీసుకు వచ్చిన అబ్బాయి పాషా తెలుగులో మాట్లాడం తో ఆశ్చర్యపోయి విషయం కనుక్కున్నాడు. ఇంతకు మునుపు అతడు మన కరీంనగర్ క్వారీపనుల్లో ఐదారేళ్లపాటు పనిచేసాడట.
వెంటనే మేము ఎడారిలో సూర్యాస్తమయం చూడడానికి ఒంటెల మీద బయలు దేరాము. ఒక ఒంటె మీద ఇద్దరం కూర్చున్నాము. అది పైకి లేచినప్పుడు ఇచ్చిన జర్క్ భలే థ్రిల్లింగ్ గా ఉంది. ఎడారిలో తప్పకుండా ఒంటె సవారి చేయాలి. నిశ్శబ్దమైన ఎడారిలో వీచే గాలి సవ్వడి ఏ గంధర్వ గాన కచేరీకి సాటి రాదు. ఆ ప్రకృతి పవన సంగీతంలో మైమరచి పోయాను.
ఒంటె చోదకులు పిల్లలు కావడం బాధనిపించింది. వాళ్ళ బంగారు భవిష్యత్తును ఫణంగా పెట్టి చిన్నప్పుడే పని చేయవలసిన వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్. అన్నట్టు ఆ పిల్లలాడే మా ఒంటె చోదకుడు. పదో తరగతి పాసైయ్యాడు. వాళ్ళ తమ్ముడు ఏడో తరగతి చదువుతున్నాడు. అప్పుడప్పుడు బడి మానేసి ఆ పని చేయాల్సి వస్తుందట. కానీ పదో తరగతి ఖచ్చితంగా పూర్తి చేస్తానని ఆత్మ విశ్వాసంతో చెప్పాడు. అంత తెలివైన పిల్లలకు పై చదువులు చదువుకునే పరిస్థితులు మన దేశంలో లేక పోవదానికి బాధ్యులెవరు?
మమ్మల్ని sunset point లో దింపేసారు. ఒంటెల కాలి ముద్రలు లేని ఒక ఎత్తైన ఇసుక తిన్నె పై నుంచి కిందికి జారాను. కానీ మళ్ళీ పైకి ఎక్కడం కష్టమైంది. ఇర్ఫాన్ సాయంతో పైకి ఎక్కాను. ఇసుకలో ఆటలు బాల్యాన్ని గుర్తుకు తెచ్చాయి. సూర్యుడు ఎడారి కొండల మాటుకు పోయేదాకా ఉండి, ఒంటెలెక్కి రిసార్టుకు వచ్చేసరికి గానాభజానా కార్యక్రమానికి సిద్ధంగా ఉన్నారు కళాకారులు. గూడారాల్లోకి వెళ్ళకుండ అక్కడే కూర్చున్నాము. ముందుగా రాజస్థానీ భాషలో స్వాగతగీతం పాడారు. తరువాత గజల్స్, జానపద గీతాలు పాడారు. రాజస్థానీ సంప్రదాయ దుస్తుల్లో నాట్యం చేసారు. మాలో కొందరు వాళ్ళతో జత కలిసాము. నేను సారా, బిమలకల్బెలియాతో డాన్స్ చేసాను. కల్బెలియాకు ఒక పాప, ఒక బాబు ఉన్నారట. బాబును హాస్టల్ లో ఉంచి భార్యాభర్తలు పాపతో అక్కడ ఉంటున్నారట. బాబు ఐదో తరగతి చదువుతున్నాడని, ఆడపిల్ల తనతో పాటే ఉందని చెప్పింది. చల్లటి చలిలో వేడి వేడి పకోడీలు తింటూ, టీ తాగుతూ కళాకారులు అప్పటికప్పుడే మాలో ప్రతిఒక్కరి మీదా పాడుతున్న పాటలు వింటూ ఉంటే ఆ కిక్కే వేరు.
మాలో ముగ్గురు అలసిపోయి గుడారాల్లోకి దూరి పోయారు. నాకు ఏడారి దాహం తీరలేదు. ఎడారి వెన్నెలను గ్రోలితే గానీ ఆ దాహం తీరదు. ఎలా? రిసార్టు అప్పటికే సద్దుమణిగింది. రిసెప్షన్ లో కూడా ఎవరూ లేరు. ఏం చేయాలి? ఎలా వెళ్లాలి? విజయ కూడా టెంట్ లోకి వెళ్ళిపోయింది. రాధా నేనూ మిగిలాము. నా దాహం ఎక్కువవుతోంది.... ఎలాగైనా వెళ్లాలనే పట్టుదల బలపడుతోంది . ... అస్థిరంగా పచార్లు చేస్తున్న నన్ను ఎక్కడి నుంచో చూసి పాటలు పాడిన వ్యక్తి వచ్చాడు. నా కోరిక చెప్పాను. ఆవాడు రిసార్టు యజమాని ఆకాశ్ కు ఫోన్ చేయడం, అతను రావడం వెంట వెంటనే జరిగిపోయింది. రాజస్థాన్ లో క్రైమ్ రేటు ఎక్కువ కదా.... సురక్షితమేనా? అడిగాను. ఎడారి మాత్రం వందశాతం సురక్షితం అని భరోసా ఇస్తూ " ఇలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మేడం , వెళ్ళండి అద్భుతంగా ఉంటుంది." కానీ చలి భయంకరంగా ఉంటుంది. తగిన జాగ్రతలు తీసుకొని వెళ్ళండి సూచించి జీపును పిలిపించాడు. ఒక్కరికి ఐదు వందలు. అంతే... గభా లున ముగ్గురం జీపు ఎక్కేసాము. ఎడారి మధ్యలో ఒక చోట మమ్మల్ని దింపేపాడు. నడక మొదలు పెట్టాము. వెన్నెల వెలుగులో ఎడారి తళ తళా మెరిసిపోతోంది. కనుచూపు మేరలో నర మానవుడు లేడు. అక్కడక్కడా ఒంటెల కళ్ళు బల్బుల్లాగా వెలిగి పోతున్నాయి. చంద్రుడు ఒక పక్క నుంచి నడినెత్తికి రావడం గుర్తించాం. ఒకే నక్షత్రికి పలునక్షత్రాలు పొడివడం గమనించాం. ఆ నిశ్శబ్ధ వెన్నెల రాత్రిని తనివితీరా అనుభవించాం. తరువాత ఆడాం .... వెన్నెల పాటలు పాడున్నాం... గంతులేసాం. అలా ఎంత సమయం గడిచిందో తెలియలేదు. మేము తిరిగి రామనుకొని కాబోలు జీప్ లైట్ల కాంతి కనిపించింది. తిరిగి రిసార్టుకు చేరుకున్నాము.
ఉదయమే ఎడారిలో సూర్యోదయయాన్ని చూడడం కొరకు ఆరుగురు ఒక ఒంటె బండి లో బయలుదేరాము. ఎడారిలో ఒంటె సవారి, జీప్ వెళ్ళే దారి, ఒంటె బండి దారి వేరువేరు. ఇలా మేము వేరువేరు దారుల్లో ఎడారి అంతటినీ చుట్టబెట్టాము. సూర్యోదయం తరువాత నేను ఒంటరిగా చాలా దూరం వెళ్ళాను. జానపద సంగీత వాయిద్యాన్ని మోగొస్తూ బీర్బల్ అనే వ్యక్తి కనిపించాడు. దాని పేరు రౌండ్ థా అని చెప్పాడు. తొలి పొద్దు వేళలో ఆ సంగీతాన్ని వినడం గొప్ప అనుభూతి. నేనూ రౌండ్ థాను పలికించే ప్రయత్నం చేసాను. కొన్ని అనుభూతులు అక్షరాల్లో ఇమడవు. భద్రంగా మదిలో పదిలపర్చుకోరలసిందే ... అలాంటిదే నా ఎడారి అనుభవం
తిరుగు ప్రయాణంలో మిల్ట్రీ యాజమాన్యంలో ఉన్న తనోతి మాత దేవాలయాన్ని, లాంగ్ వాలా ఇండో పాక్ బార్డర్ ను 200 మీటర్ల లోపలి వరకు వెళ్లి చూసాము. దాని కొరకు ప్రత్యేక అనుమతి తీసుకున్నాము. గేట్ బయట ఉన్న వాచ్ టవర్ ఎక్కి చూసినప్పుడు పాకిస్తాన్ లోని ఎత్తైన భవనాలు కనిపించాయి. 1971 నాటి లాంగీవాలా భారత్ పాకిస్తాన్ కు సంబంధించిన డాక్యుమెంటరీ సినిమా చూసాము. ప్రవేశ రుసుము ఒక్కరికి 50 రూపాయలు. లాంగీవాలా వార్ మెమోరియల్ మ్యూజియం కూడా చూసుకొని హైదరాబాదు చేరుకున్నాము.
-------------------- ×------------------
గిరిజ పైడిమర్రి
ట్రావెలర్
9949443414