కళింగాంధ్ర కథా ఆణిముత్యం.. బలివాడ కాంతారావు

remembering poet balivada kantharao

Update: 2023-07-02 19:15 GMT

రాశిలోనే కాక వాసిలోనూ మేటి అయిన ఆ గొప్ప సాహితీ స్రష్ట బలివాడ కాంతారావు. ఆయన 1927 జూలై 3న పుట్టారు. తండ్రి, గురువుల ప్రభావం కన్నా తాత గారి ప్రభావం కాంతారావు మీద ఎక్కువ. బలివాడకు భారతీయ తత్వాన్ని, ఆధ్యాత్మిక దర్శనాన్ని చేయించింది ఆయనే . వారి ఉద్యోగ జీవితం దానికి మరింత వైవిధ్యత, విశిష్టతలనిచ్చింది. ఆయన సాహితీ జీవితం 'శారద' అనే నవలతో మొదలైంది. 1947లో ‘పరివర్తన’ అనే మొదటి కథను రాశారు. వీరి రచనలు.. హిందీ, తమిళ్, కన్నడ, గుజరాతీ , ఒడియా, ఆంగ్లభాషల్లోకి అనువాదం అయ్యాయి. వీరి ‘దగాపడిన తమ్ముడు’ అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. వీరి.. ‘అడవి మనిషి’ నాటకం జాతీయ కార్యక్రమంగా ఆకాశవాణిలో అన్ని భారతీయ భారతీయ భాషల్లోను ప్రసారమయింది. ‘పుణ్య భూమి’ నవలకు సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు అందుకున్నారు.

కాంతారావు.. రచనా కౌశలం..

మనిషి ఎంతగొప్ప పదవులు పొందినా, డబ్బు గడించినా మూలాలను వీడకూడదని వారి సిద్ధాంతం. ఆ నేపథ్యంతో రాసిందే చక్రతీర్థ.. అన్న కథ.. దీనిలో ప్రధాన పాత్ర శ్రీధర్. కలెక్టర్. తండ్రి సుదర్శన్ పండా భక్తుల దగ్గర డబ్బు గుంజి, ఆ డబ్బుతో శ్రీధర్‌ని ఉన్నత చదువులు చదివించి కలెక్టర్‌ని చేసాడు. ఆ తండ్రి అంటే అసహ్యం కలుగుతోంది. తండ్రి చివరి మాటలు... ఎంత పైకి నువ్వు ఎదిగావన్నది కాదు ముఖ్యం. ఏమి సాధించావన్నది ముఖ్యం. వెళ్ళు -నాయనా వెళ్ళు అంటూ ముఖం తిప్పేస్తాడు. కొడుకు దురుసు ప్రవర్తనకు అతలాకుతలమైన మనస్సుతో, చదువు వల్ల జన్మ సంస్కారం మరింతగా తోజోవంతమవ్వాలి. సుదర్శన్ పండా పేర్కొన్న రెండు సంస్కారాలు కోల్పోయిన వాడయ్యాడు శ్రీధర్.

ఇంకోటి ‘ముంగిస కథ’ రచయితకు విశేషమైన ఖ్యాతిని తెచ్చిన కథల్లో ఇది ఒకటి. ఒక డాక్టర్ దంపతులు ఒక ముంగిసను పెంచుకోసాగారు. బిడ్డలు లేకపోవటంతో అబయ్యన్న అన్న పేరు పెట్టి.. సొంత బిడ్డలా సాకటం మొదలుపెట్టారు. ఎంతో ఆనందంగా సాగిపోయే ఈ ఆనంద జీవితంలో ఒక విఘాతం భైరవయ్య వీళ్లచుట్టం. వీళ్ల ఆర్థిక పరిస్థితికి ఈర్ష్య, బయ్యన్న మీద అకారణ కోపం అది. వారు వేరే ఊరెళ్లిన వేళ బయ్యన్నను చంపేస్తాడు. పట్నం నుండి ఇంటికి చేరుకున్న ఆ దంపతులకు బయ్యన్న జాడే తెలియక కన్నీరు మున్నీరుగా ఏడ్చారు. కొంతకాలం తరువాత చేసిన తప్పు మనస్సును కుదిపేయగా, మనోవ్యాధితో మంచమెక్కి చనిపోతాడు భైరవయ్య. బయ్యన్న దీనమైన, అమాయకమైన మొహం, చంపద్దని అది చేసిన ఆక్రందన పాఠకుల హృదయం బరువెక్కుతుంది. రక్తం చల్లబడుతుంది. కన్నుల ముందు బయ్యన్న రూపం, దాని ఘల్లు ఘల్లు మనే శబ్దం వారి చెవులకు వినిపిస్తూనే ఉంటుంది. రచయిత ముంగిస పాత్రను ఎంత గొప్పగా మలిచారో!

ఇంకోటి ‘దృష్టి’ విశ్వనాధం ఆంగ్ల సాహిత్యంలో పోస్టు గ్రాడ్యుయేట్. ఒక ప్రైవేటు కంపెనీలో పెద్ద ఉద్యోగం. అతని దృష్టిలో తండ్రి ఒక దీనుడు. ఆస్తికుడు. అజ్ఞానుడు. ఆ పల్లెలో చదివితే అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉండదని, ఆంగ్ల భాష కోసం పట్టణానికి ఆ కొడుకును పంపించింది ఈ మూర్ఖుడైన తండ్రే. ఆంగ్లమే ఊపిరిగా ఎదిగి ఉన్నత దశకి చేరిన కొడుకు రమేశ్‌ను అమెరికా పంపించకుండా ఎలావుంటాడు! తండ్రి శవానికి స్నానం చేయిస్తున్నప్పుడు, తలకి నిప్పు అంటించేటప్పుడు, అస్థికలు ఏరుకోటానికి వెళ్ళినప్పుడు తండ్రి గొప్పతనాన్ని తెలుసుకుని, నా తండ్రిని బ్రతికుండగా తెలుసుకునే దృష్టి నా చదువు నాకివ్వనిది.. అతను బూడిదై నాకు ప్రసాదించాడేమో. అని కొడుకుకు ఒక ఉత్తరం రాశాడు. సాధారణంగా రచయితలు ఇక్కడ కథను ముగిస్తారు. కానీ, బలివాడ ఇక్కడే ఈ కథకు ఓ అద్భుతమైన మలుపు ఉత్తరం ద్వారా ఇచ్చాడు..‘మీ తండ్రిని మీరు ఆయన చావు తరువాతే తెలుసుకున్నారు. మీకు ఎప్పుడూ పరభాషా వ్యామోహమే. కానీ తాతయ్య నాకు తెలుగు భాష నేర్పారు. ఉపనిషత్తుల సారం నుంచి రామాయణ, భారత కథలు, శంకరుల అద్వైతం వరకు నాకు అర్థమయ్యేలా చెప్పారు. భారతీయ చింతన, సంస్కృతుల గూర్చి చెప్పి భారతీయ దర్శనం చేయించారు. నా జాతి దృష్టితో, ఇక్కడ వీళ్ళ భాష సహాయంతో ఇక్కడ ఈ జాతి ఆలోచనా సరళి , జీవితం విధానం, సంస్కృతిని చూస్తున్నాను. ఈ రెండు సంస్కృతుల రాపిడిలో ఏ ఒక్క అగ్నికణం రాలి ప్రకాశించినా, అది నా దృష్టిని తేజోవంతం చేస్తుందని నమ్ముతున్నాను’. అంటూ దృష్టి అన్న మాటకు అద్భుతమైన వాఖ్యానం అందించాడు.

పాఠకులకు.. జీవన శకలాలు చూపిస్తూ

ఇలా ఎన్నెన్నో ఆలోచించే కథలు రాసినా, ఇంకా నా నుంచి మంచి రచన రావాలని చెప్పేవారు. కథను సూటిగా, క్లుప్తంగా, రక్తిని కట్టిస్తూ చెప్పగల గొప్ప రచయిత. సరళత, సూటిదనం పూర్తి వ్యవహారిక భాషలో సాగే వీరి అనేక కథలు పాఠకులకు జీవితాన్ని, దానిలోని అతి సూక్ష్మమైన శకలాలను చూపిస్తాయి. నిగర్వం, నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధతలు వ్యక్తిగానే కాక రచయితగానూ ఉన్న అద్భుత రచయిత బలివాడ కాంతారావు. రచయిత ప్రజల దగ్గర నుండి, గురుత్వం పొందిన రచయితల నుండి, సాహిత్యం చదవడం ద్వారా నేర్చుకోవాలని అనేవారు. దానినే ఆచరించి చూపారు. ఇందుకు వారు ఆదర్శనీయులు, అనుసరణీయులు. నిస్సందేహంగా బలివాడ కాంతారావు కళింగాంధ్ర కథా ఆణిముత్యం.

(నేడు బలివాడ కాంతారావు జయంతి)

బొడ్డపాటి చంద్రశేఖర్.

ఆంగ్లోపన్యాసకులు

63003 46501

Tags:    

Similar News

వెలుగు