బతుకంతా, కవిత్వమంతా ...దేశానిది!

Remembering Kaloji Narayanarao

Update: 2024-09-08 18:45 GMT

"నీ మాటను పాటించే మాటే యీనాడు లేదు.

నీ బాటను బట్టి నడచు చోటే అగుపించదిల.

నీ అడుగుజాడ, నీ చేతలు, నీ మాటలు, నీ వలెనే

మటుమాయం అయినయంటే నమ్ముతావో?లేదో? నువ్వు."

అంటూ మహాత్ముడి గురించి రాసిన కాళోజీ ఆందోళన తాలూకు అక్షరాలు నేటి సమాజంలో కొన్ని సందర్భాల్లో అప్పుడప్పుడు నిజాలవుతున్నాయి. పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు గాంధీజీ స్ఫూర్తితో గాంధేయ మార్గంలో తన యావత్ జీవితాన్ని సత్యం, అహింస పునాదులపై కొనసాగించారు. స్వాతంత్ర్యోద్యమంలో తన వంతు పాత్ర పోషించి తన యావత్ జీవితాన్ని ప్రజా సమస్యలపై, ప్రజా ఉద్యమాల్లో పాల్గొని తన బతుకును ఈ దేశానికి అంకితం చేశారు. ప్రతి సందర్భంలో తన కవిత్వపు గేయాల ద్వారా సామాన్యుల సమస్యల గొంతుకయ్యారు.

"తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా?

తెలంగాణ వేరైతే తెలుగు బాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే కిలోగ్రామ్ మారుతుందా?

తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపోతుందా?"

"ప్రత్యేక తెలంగాణ పనికిరాదు అంటారా?

ప్రత్యేక తెలంగాణ రానే రాదు అంటారా?"

అంటూ తెలంగాణ ప్రజల ఆర్తి, ఆగ్రహం, ఆవేదనను తన అక్షరాల రూపంలో ధ్వనిస్తూ, ప్రతిధ్వనిస్తూ తెలంగాణ ఉద్యమ ప్రముఖ నాయకుడిగా చరిత్రలో నిలిచారు. గ్రంథాలయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం వుండాలని ఆకాంక్షించారు. నిజాం పాలన తీరుపై తన కలంతో సమరాన్ని నడిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాళోజీ గౌరవార్థం, జ్ఞాపకార్ధం ఆయన శత జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9 న తెలంగాణ భాషా దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఆయన పేరుతో అవార్డును ప్రభుత్వం అందజేస్తోంది. వరంగల్ లోని ఆరోగ్య విశ్వవిద్యాలయంకు ఆయన పేరుపెడుతూ, హన్మకొండలో ఆయన పేరుమీద కళాక్షేత్రాన్ని నిర్మించారు.

మన అన్నప్పుడు గదా ముందడుగు

మత సామరస్యానికి విలువ ఇచ్చే కాళోజీ వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. ఏ రాజకీయ పార్టీకి పరిమితం కాకుండా స్వతంత్రుడిగా, అందరివాడిగా వుంటూ 1958 లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపకుల్లో ఒకరు కాళోజీ. తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడం, ఇంగ్లీష్ వంటి భాషల్లో మంచి ప్రావీణ్యం వున్న కాళోజీకి , ఆయనలోని సామాజిక స్పృహకి ప్రతిష్టాత్మక కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. మన దేశ మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, శ్రీ శ్రీ, ప్రొఫెసర్ జయశంకర్ వంటి ఎంతోమంది ప్రముఖులతో కాళోజీకి మంచి సంబంధం వుండేది. ఏ ఉద్యోగం చేయక సంపాదన లేని కాళోజీ జీవితం మొత్తం తన అన్న కాళోజీ రామేశ్వర్ రావుపై ఆధారపడి వుంది. ఆ అన్నదమ్ముల అనుబంధం అందరికీ ఆదర్శం."నేను నా ఆరవ యేట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాక దిగలేదు. నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ అతను నన్ను దించకుండా వుండటం గొప్ప" అంటూ తన అన్న గురించి కాళోజీ చెప్పుకున్నారు. నేనింకా 'నా' నుండి "మా" వరకే రాలేదు. మన అన్నప్పుడు గదా ముందడుగు అంటూ తనలోని మానవత్వపు కోణంలోనే ఆయన జీవన ప్రయాణం కొనసాగింది.

భారత రాజ్యాంగం ప్రమాదంలో వుందని కొంత మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రస్తుత తరుణంలో భారత రాజ్యాంగం గొప్పతనం గురించి కాళోజీ రాసిన"మను ధర్మశాస్త్రమైన, బైబిల్ ఖురానులైన ఇంకే మత శాస్త్రమైన ఏలుతూ లేదు మనల్ని "మనం ఒకేసారి గుర్తు చేసుకోవాలి. భాష, యాసలతో కూడిన కవిత్వపు నూతన పోకడల గురించి విభిన్న వాదనలు మనం వింటున్నాం."ఎవని యాసలో వాడు మాట్లాడుతున్నట్లే ఎవని మాండలికము వాడు వాడుకొనుచున్నట్లే ఆ యాసతో, ఆ విరుపుతో ఆ యమకం గమకంతో రాస్తే, తప్పేమిటంట?" అన్నారు కాళోజీ.

నా గొడవను మన గొడవగా చేసి..

"A single drop of Ink that make the millions to think" అన్న ప్రఖ్యాత రచయిత బైరాన్ మాటలకు ప్రేరణ పొందిన కాళోజీ"అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు "అంటూ తన సిరా చుక్కల "నాగొడవను" వాడివేడి పదునుతో లక్షల మందిని కదిలించారు. గేయాల కవిత్వమై కనిపించాడు. తన బతుకంతా ప్రజాహితమై, కవిత్వపు మతమై జీవించాడు.

"దోపిడి చేసే ప్రాంతేతరులను/దూరం దాకా తన్ని తరుముతం / ప్రాంతం వారే దోపిడి చేస్తే/ప్రాణంతోనే పాతర వేస్తాం" అని ఎలుగెత్తి చాటిన "కాళోజీకి ఆడంబరాలు లేవు! కాళోజీ కవితకు అంబరాలు లేవు, కాళోజీ మంది మనిషి, కాళోజీ కవిత ప్రజల పరువం".

(నేడు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా)

ఫిజిక్స్ అరుణ్ కుమార్

93947 49536

Tags:    

Similar News

అమరత్వంపై