జీవన పోరాట పథంలో హెచ్. నరసింహయ్య

Poratapadam Book Review

Update: 2024-09-15 18:45 GMT

ఆంగ్ల భాష సాహిత్య ప్రభావంతో మన తెలుగు భాషలోకి వచ్చిన సాహితీ ప్రక్రియల్లో స్వీయచరిత్ర లేదా ఆత్మకథ అనేది ముఖ్యమైంది. ఐతే, ఇది అక్కడితో ఆగలేదు. కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలు చేసినవారు వారి అనుభవాలనూ, జ్ఞాపకాలనూ భావితరాలకు తెలియజేసే ప్రత్యక్ష కథన ప్రక్రియ ఇది. లోకంలో మహానుభావుల విశిష్టతను తెలుసుకోవడానికి పనికొస్తుంది.

అంతే కాదు. ఆయా ప్రముఖులు జీవించిన కాలాల్లో దేశ, కాల, సమాజ, ఉద్యోగ, ప్రభుత్వ, సాంస్కృతిక పరిస్థితులు, సామాన్య జీవుల స్థితిగతులు, విద్య... ఇవన్నీ ఎలా ఉండేవో తెలియజెప్పడానికి ఈ స్వీయచరిత్రలు ప్రామాణికమైన గ్రంథాలుగా పనికి వస్తాయి. ప్రముఖుల గురించి ఎవరో రాసే జీవిత చరిత్ర కన్నా స్వీయచరిత్రల్లో ప్రామాణికత ఎక్కువ. అంతేకాదు. నిజాయితీతో రాసిన ఆత్మకథలనేవి భావితరాలకు వ్యక్తిత్వ వికాస గ్రంథాలుగా ఉపకరిస్తాయి.

తెలుగులో ఆత్మకథలు తక్కువే!

స్వాతంత్ర్యానికి పూర్వం కర్ణాటక, మదరాసు, కేరళ, ఒరిస్సా వంటి ప్రాంతాల్లో ఎందరో తెలుగు ప్రముఖులు, తెలుగువారే అయినా కారణాంతరాలవల్ల వారు ఆయా స్థానిక భాషల్లోనే ఆత్మకథలు రాశారు. అవి కన్నడ, తమిళ, ఒరియా భాషల్లో రాసినా ఆనాటి తెలుగు వాతావరణాన్ని వారు రాసినట్లు వేరే ఎవరూ రాయలేరు. ఈ కోవకు చెందినవారే కన్నడ దేశంలో ప్రఖ్యాతిగాంచిన విద్యా, తాత్విక వేత్త హొసూరు నరసింహయ్య. వీరిని హెచ్ఎన్ అనీ పిలిచేవారు. ప్రముఖ విద్యావేత్త, హేతువాది కూడా. 1995 ప్రాంతాల్లో తన జీవిత చరిత్రను కన్నడ భాషలో రాసుకొన్నారు. దానికి “హోరాట హాది” అని పేరు పెట్టారు. తెలుగులో గాంధీకి ఇచ్చిన ప్రచారం వేరే ఎవ్వరికీ ఇవ్వలేదు. అందువల్ల వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖుల స్వీయచరిత్రల అనువాదాలు తెలుగులో చాలా తక్కువే వచ్చాయని చెప్పాలి. నిజానికి ఇటువంటి ప్రముఖుల ఆత్మకథల అనువాదాలు ఎంతో అవసరం.

అనువాదంలో లోపం లేకుండా..

ఈ అవసరాన్ని గుర్తించే హెచ్.నరసింహయ్య ఆత్మకథను కోడిహళ్ళి మురళీమోహన్ తెలుగులోకి అనువదించ పూనుకోవడం అభినందనీయం. కోడీహళ్ళి మురళీమోహన్ బహు గ్రంథ రచయిత, సంపాదకుడు కూడా. హిందూపురం సమీపంలోని లేపాక్షి మండలంలోని కోడీహళ్ళి స్వగ్రామం. కాబట్టి ఆయనకు గ్రామ ఆవాస పరిస్థితులు కూడా పరిచయమే. ఈ “పోరాట పథం” అనువాదం మూలానికి అతి దగ్గరగా ఉండి, చదవడానికి చాలా సరళంగా ఉంది. తాము చేపట్టిన పనిని అనువాదకులు సక్రమంగా చేశారని పూర్తిగా చదివితే తెలుస్తుంది. అనువాదకర్తలకుండే పరిధిని ఏమాత్రం దాటకుండా, అనువాదంలో ఎలాంటి లోపం లేకుండా అనువదించారు కోడీహళ్ళి. కన్నడ, తెలుగు భాషలపై అనువాద రచయితకు ఉండే పట్టును మనం ఈ రచనలో చూస్తాం. అనేక ఆంగ్లపదాలకు సులభమైన తెలుగు పదాలను వాడటం రచయితకు ఆంగ్లం మీద కూడా పట్టుందనిపిస్తుంది.

తన జీవితంలోని పలు అంశాలను..

డాక్టర్ నరసింహయ్య తాము పుట్టి పెరిగినప్పటి నుంచి, గుర్తున్నంత మేరకు తన జీవన పోరాటాన్ని 20 అధ్యాయాల్లో సరళంగా వర్ణించారు. వారి బాల్యం, విద్యాభ్యాసం, క్విట్ ఇండియా ఉద్యమం, రామకృష్ణ ఆశ్రమవాసం, విద్యార్థిగా, అధ్యాపకునిదాకా నేషనల్ కాలేజీలో ఉండటం, ఉద్యమాల్లో పాల్గొనడం, అమెరికాలో విద్యాభ్యాసం, ప్రిన్సిపాల్‌గా, బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, శాసన మండలి సభ్యునిగా, వివిధ సంస్థలకు అధ్యక్షునిగా వారి పోరాటపథాన్ని మనం ఈ గ్రంథంలో వీక్షించవచ్చు. వీరు మొదటినుంచి పూర్తి నాస్తికులేమీ కాదు. భగవద్గీతను నమ్మినవారు. ఐతే, గుడ్డిగా ఆచరించడానికి ఆయన వ్యతిరేకం. మూఢనమ్మకాలన్నా, బాబాలన్నా, స్వాములన్నా వారికి ఆసక్తి లేదు సరి కదా, వారిని ప్రశ్నించగలిగిన అతి కొద్దిమందిలో ప్రముఖుడైనారు. బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్న కాలంలో ఏకంగా బాబాల మీద, వారి మహిమల మీద తనిఖీ చేయడానికి కమిటీని వేసినవారు నరసింహయ్య. తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు. తోటివారు విమర్శించినా పట్టించుకోలేదు. వైవాహిక జీవితం మీద ఆసక్తి లేకనో, సమాజసేవపై ఆసక్తి వల్లనో ఆయన అవివాహితులుగానే మిగిలిపోయారు. కర్ణాటక రాష్ట్రంలో అచ్చమైన మానవతావాదిగా ఆయనదొక విశిష్టమైన స్థానం. గాంధీ అనుయాయిగా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ప్రయత్నించారు. తన జీవితంలోని పలు అంశాలను తాను పరిశీలించుకొని తన అనుభవాలను నిజాయితీగా, ధైర్యంగా అక్షరబద్ధం చేశారు. దేనినీ ప్రశ్నించకుండా వదిలే మనస్తత్వం కాదు ఆయనది. సత్యసాయిబాబాతో ముఖాముఖీ తలపడ్డంతో హేతువాద బృందంలో ప్రముఖులై నిలిచారు.

హెచ్.ఎన్. జీవితంలో జరిగిన అనేక సంఘటనల సమాహారంగా 480 పేజీల్లో ఈ అనువాదం సాగింది. ఈ గ్రంథం భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దపు సంక్లిష్టమైన జీవితానికి అద్దం పడుతుంది. అప్పటి దేశ స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, ప్రజల్లో దేశభక్తి, జీవనంలో పోకడలూ మనకు కళ్లకు కట్టినట్లు వర్ణించారు. 'పోరాటపథం' అనే ఈ బృహత్ గ్రంథం నన్ను ఏకబిగిన చదివించిందీ అంటే, అది నరసింహయ్యగారి రచనా సంవిధానంతోబాటు, అనువాదకుని ప్రతిభ అని చెప్పక తప్పదు. ఇంకా వెలుగు చూడని ఇలాంటి ప్రముఖుల స్వీయచరిత్రలు వెలికి తీయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ గ్రంథాన్ని అనువదించిన కోడిహళ్ళి మురళీమోహన్‌నీ, ప్రచురించిన డా. హెచ్. నరసింహయ్య సోషల్ అండ్ కల్చరల్ ప్రతిష్ఠాన్ ట్రస్ట్ వారినీ ఈ సందర్భంగా అభినందించాలి.

పుస్తకం: పోరాట పథం (ఆత్మ కథ)

డా. హెచ్. నరసింహయ్య (1920-2005)

తెలుగు అనువాదం కోడిహళ్ళి మురళీమోహన్

పేజీలు 480. వెల రు. 500

ప్రతులకు: నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్

97013 71256


సమీక్షకులు

డా. వి.వి. వేంకటరమణ

94412 34429

Tags:    

Similar News