నేనే పుస్తకాన్ని... వెల కట్ట లేని నేస్తాన్ని

Poem on BOOK

Update: 2023-08-13 19:00 GMT

నేను కేవలం అక్షరాల సముదాయమో..

వాక్యాల సంకలనమో కాదు..

ఎందరో రచయితలు

కవులు, కవయిత్రులు

శాస్త్రవేత్తలు, చరిత్ర కారులు

పండితుల మేథో మధనాన్ని..

నేను కేవలం కాగితపు పుటల

సంకలనాన్నో..

అందాల బొమ్మల ఆటవిడుపునో కాదు..

గత చరిత్ర సాక్ష్యాన్ని ..

వర్తమానపు పాఠాన్ని..

భవిష్యత్ తరాలకు దిక్సూచిని.

నేను కేవలం కాలక్షేపపు పొత్తాన్ని కాదు..

పొట్లాలు కట్టుకునే చిత్తు కాగితాన్ని కాను..

వేదాలు నేనే.. పురాణాలు నేనే

భాగవతం నేనే, రామాయణం నేనే

భగవద్గీతను నేనే

ఖురాన్ నేనే, బైబిలూ నేనే..

పంచమ వేదం భారతమూ నేనే..

నేను కేవలం హస్త భూషణాన్ని కాదు..

అల్మారాలో అలంకరించే వస్తువుని కాను

అపర విజ్ఞానం పంచే విరించినీ నేనే

అంధకారం పోగొట్టే సూర్యుడిని నేనే..

ఊహల ఊయలలో తేలియాడించే

అద్భుత కావ్య కన్యకను నేనే..

నేను కేవలం కథల సంకలనం కాదు..

తలకింద పెట్టుకునే దిండునూ కాను

కన్నీటి కథల బతుకు చిత్రాన్ని

ఆపన్నులకు స్నేహ హస్తాన్ని..

కోట్లాది మెదళ్ళకు మేతని..

భావి తరాలకు మార్గదర్శిని..

అక్షర జ్ఞానం పంచే అపర సరస్వతిని..

నేనే పుస్తకాన్ని

వెల కట్టలేని నేస్తాన్ని..

శిరందాస్ శ్రీనివాస్

నిజాం వైద్య విజ్ఞాన సంస్థ

9441673339


Similar News

వెలుగు

పగటి వేషం