మగ్గం మీద పోగు ఉన్నదంటే
కంచంలో ముద్ద పడ్డట్టే
మెతుకు ఉడుకుతున్నట్టు
నాడె ఆడుతూ ఉంటే
ఆకలి పేగు కొంత ఊరడిల్లుతుంది
పట్టు పురుగు
ఏ ముహూర్తాన వదిలిందో
దారం షేర్ మార్కేటుతో
పోటీ పడుతున్నది
పైకీ కిందికీ
ఉచ్ఛ్వాసం నిశ్వాసంలా
మాటిమాటికి
ఆరోహణ అవరోహణ స్వరాలు
మీటుతున్నది
ఎగుడూ దిగుడూ
ఎత్తు పల్లాల బతుకు
గాలికి ఊగుతున్న దీపం
పోనన్న పోదు
దీపం వేడికి
ఉట్టి మీది వెన్న కరుగుతున్న ఆశ
కొమ్మకు వేల్లాడుతున్న
దోర మామిడి పండులా ఊరిస్తున్నది
దారం పిరమయినపుడల్లా
దుఃఖానికే దుఃఖం
దారం చేతికందడం
వింతల్లో వింత
ఆకాశవాణి
హెచ్చరించినప్పుడే నీ ఇంటికి తుఫాను
మగ్గాన్నే నమ్ముకున్న ఇల్లు
పూట పూటకు
జడివానకు వణుకుతున్న పిట్టగూడు.
- గజ్జెల రామకృష్ణ
8977412795