సూర్యునికి సమానులం

Poem

Update: 2024-12-15 21:30 GMT

మా జీవితాలు

కాలెండర్‌లోని నెలల లాగే పాతవే

మేమూ పొడుస్తున్న పొద్దులమే

మురికివాడల్లో డంపింగ్ యార్డులో

రోజూ పొద్దున్నే రోడ్లు ఊడ్చే సపాయిలం కదా

సూర్యునికి సమానులం కాదా?

తెల్లారి పొద్దెక్కుతుంటే ఊర్లలో

పాతినుప సామాన్లు కొనడం

పక్కపినీసులు బొట్టుబిళ్ళలు అమ్మడం

మాకు తెలిసిన చదువులు

సూర్యుని చుట్టూ భూమి తిరిగినట్టు

జీవిత చక్రంపై మేము తిరుగుతుంటాం

జర నిశితంగా పరిశీలించండి

సంవత్సరం మారినప్పుడు

కాలెండర్ కొత్తగా ఉంటుందని

ధనవంతుల జాబితాలో

మా పేర్లు చేర్చకండి

బ్యాంకులను దోచుకున్నోడు

రాయితీ పొందుతున్నాడు

కుటుంబ పోషణకు తీసుకున్న లోన్‌కు

వడ్డీ రెండింతలు కడుతున్నాము

అలాగని ప్రతిసారి మమ్మల్ని

బహుజనులు అని హేళన చేయకండి

ఎండ ఉన్నంగానే వర్షం పడినట్లుగా

హేళన నుంచే విజేతలుగా పుట్టుకొస్తాము

మీరు కూర్చున్న కుర్చీ కూలిపోయే

సంతకాలై అధికారికంగా నిలబడతాం

అవమానాలను ఎదుర్కొని

అంబేడ్కర్ నిలబడినట్లు..

ఎజ్జు మల్లయ్య

91006 10501

Tags:    

Similar News