యోగ్యత ఆకాశానిదే!

Poem

Update: 2024-11-17 18:30 GMT

ఆకాశం శూన్యం కాదు

దాని హృదయం నిండా

అమృత ప్రవాహమే!

సమస్త జీవుల

ఆకలి దప్పుల కోసం

జలరాశులను గుమ్మరిస్తుంది!

నింగి కన్ను తెరవందే

నేల నెమలి పింఛమై విచ్చుకోదు

నాగలి మీసం మెలివేయదు!

నేల రాలిన

ఆ నాలుగు చినుకులే

లోకానికి వసంతాలను రాసిస్తాయి!

విర్రవీగుతాం కాని

దాని దయా వృష్టి లేనిదే

ప్రపంచానికి ఉదయాలుండవు!

అమృత ధారలతో

నింగీ నేలను ఏకం చేసిందా

సమస్త కాలుష్యాలు కను మరుగైతవి!

వరదలు ఎప్పుడూ

సహజాతాలు కావు

ప్రవాహానికి ఎదురొడ్డిన స్వార్థాలు!

ఎప్పుడు ఎడ తెగక పారే ఏర్లే కదా

జన నివాస యోగ్యాలు!

ఎన్ని నిందలు మోపినా

నింగి ఎన్నడు నిబ్బరం వీడదు

జీవరాశుల ప్రాణదానం మరవదు!

వినియోగ సంస్కృతి మనది

యోగ్యత ఇవ్వడంలోనే దాగుంది

దానికి ఆకాశమే హద్దు!!

- కోట్ల వెంకటేశ్వర రెడ్డి

9440233261

Tags:    

Similar News