రాత్రి, నిశ్శబ్దాన్ని
ఇష్టపడుతుంది అన్నాడు అతడు
బలవంతంగా అలవాటు చేసింది అందామె
కాదు, నిశ్శబ్దం
సుఖాన్ని ఇస్తుందన్నాడు అతడు
లేదు, వినిపించని దుఃఖాన్ని
మోస్తుంది అందామె
కిటికీ తెరుస్తూ చూడు,
ఏ చప్పుడు లేని ఈ ప్రపంచం
ఎంత ప్రశాంతంగా ఉందో అన్నాడు
విను, నిశ్శబ్దం ఎంత ఘర్షిస్తుందో అందామె
బొత్తిగా నీకు అర్థాలు తెలియవు
అనుకుంటా..అన్నాడు అతడు అంతలోనే
వీధిలోని కుక్క ఏ రాగమో
తెలియకుండా పాడుతూ ఉంది
ఆమె బొమ్మలేగిరేసి అతడి వైపు చూసింది
ఆకలో, ఆక్రందనో అర్థం తెలియని పాట
వినగలిగే హృదయం ఉంటే
నిశ్శబ్దానికి స్వరముంది అందామె
చేతికి అందిన దానితో విసిరి కొట్టాడు
కిటికీ అద్దం పగిలిపోయి
ఎర్రగా పొద్దెక్కింది
నిశ్శబ్దంగా కాలం చాటున
కుక్క, ఆకలి, అరుపు, ఆక్రందన, ఆమె
-పి.సుష్మ
99597 05519