జనారణ్య

Poem

Update: 2024-10-20 23:00 GMT

ఒక తెల్లటి వెలుగు మేఘం

ఇంకో బూడిద రంగు మేఘంలోకి

తనని తాను ఇముడ్చుకుంటూ

గుంభనంగా అంతర్థానమవుతూ...

ఒకవైపు ఆకసం నీలిలో

కుంచెతో తెల్లటిచారలు

ముగ్గు పరిచినట్టు...

పిచ్చి మొక్కలు గడ్డి

ఎగుడుదిగుడుగా

పైకి పైపైకి సందున్నచోటల్లా

గుట్టపైకి పాక్కుంటూ ఎటో...

మరోవైపు జనారణ్యం కూడా..!!

మొహాలూ కాళ్ళూ గుంపులుగా...

రోడ్లూ అడ్డాలు దుఖాణాలూ మాల్స్...

కరెన్సీ నోట్లు చేతులు మారుతూ

ఆ సాయంత్రం రాత్రిని కావలించుకుంటుంది

ఎల్ఈడీ దీపాల సాక్షిగా..!

ఈ జనానికేమో ఆకలి ఎక్కువ...

సాయంకాలానికల్లా అలసిపోయి

వచ్చి మీద పడిపోతుంది...

ఆవురావురుగా తిరుగుతూ తింటుంది...

పొద్దెక్కేసరికి భయంకరమైన వార్తలు

మేల్కొంటాయి మన మధ్యలోంచే..!!

ఆవేశం కట్టలు తెంచుకుంటుంది...

ఊపిరి బుసలు కొడుతుంది...

మన స్థితి మనల్ని బిగబట్టి

వెనక్కి లాగుతుంది...

అరుస్తాం రోదిస్తాం నిలదీస్తాం...

చర్యకు ప్రతిచర్యను ప్రేరేపిస్తాం...

కానీ క(న్నీ)ళ్ళకు గంతలు కట్టుకున్న

ఆమెను మాత్రం నోట్లో గుడ్డలు కుక్కి

ఏ రైలు పట్టాల మీదనో పడుకోబెడతాం..!!!

తాత్కాలికంగా ఉపశమనం పొందుతాం!

మళ్లీ పొద్దున వార్తలు వస్తూనే వుంటాయి...

- రఘు వగ్గు

96032 45215

Tags:    

Similar News

అమరత్వంపై