అందరొకటి కావడమే పరిష్కారం

Poem

Update: 2024-10-20 22:15 GMT

అతను షిర్డీ సాయిబాబా కాదు

సత్య సాయిబాబా కూడా కాదు

అతను అచ్చంగా ప్రొఫెసర్ సాయిబాబా

అతను విరాగీ.. బైరాగీ కాదు

అతనికి ఇంద్రజాలం. చేయడం రాదు

మంత్ర తంత్రాలున్నాయని

ప్రజలను మోసగించడం తెలియదు

తాను భగవంతుని అవతారమని నమ్మించలేదు

రాజకీయాలు ప్రజలగూర్చి

అభివృద్ధి గూర్చి మాత్రమే చేయాలన్నాడు

తొంబై శాతం వికలాంగుడైనా

అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికంటే

పరిపూర్ణ వ్యక్తిత్వ మూర్తి

గుండెల్లో ధైర్యం.. హృదయంలో మానవత్వం

పీడిత ప్రజల యెడ సహానుభూతి

అసమానత్వాలపై ఆవేశం

సమానత్వం కోసం పోరాటం

జీవితం మొత్తం ఆరాటం

అదే రాజ్యానికి ఆగ్రహం

గిరిజనులు ఆదివాసీలు

పేద ప్రజల పక్షం వహించడమే అతని తప్పు

బ్రిటిష్ వారిని పంపిస్తే సరా

సమానత్వం సమాన అవకాశాలు

ప్రజాస్వామ్యాల సంగతి ఎంతకీ తేల్చరే

వారు చేయవలసిన పనులను

గుర్తు చేయడం.. ప్రశ్నించడమే అతని నేరం

అందుకే తప్పుడు కేసులతో జైలు నిర్భంధం

బెయిల్ కూడా మంజూరు చేయని దుర్మార్గం

కనీస సౌకర్యాలు కల్పించని కఠినాత్మం

వెరసి పొట్టన పెట్టుకున్న ప్రభుత్వ దుర్మార్గం

ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ పాశవిక పాలనం

అందరొకటి కావడమే పరిష్కారం

అరుణ జ్యోతి

99661 81561

Tags:    

Similar News