ఉదయాన్నే
పూల తోటలో తిరుగుతుంటే
పారిజాతం లోని పరిమళంలా,
మల్లెల్లోని సుగంధంలా,
మందారంలోని మకరందంలా
నన్ను తాకుతూనే ఉంటావు
ఎటు చూస్తే అటే
రంగు రంగుల పూలు నింపిన పూలసజ్జతో
వన దేవతలా సాక్షాత్కరిస్తూనే ఉంటావు!
నేను రామాయణం లోని రసమయ పద్యాలో,
దేవులపల్లి భావ గీతాలో చదువుతుంటే
నాతో గొంతు కలిపి శ్రావ్యంగా ఆలపిస్తూనే ఉన్నావు!
నువ్వు పాడుకున్న బాలమురళి తత్వాలు,
అన్నమయ్య కీర్తనలు
ఈ ఇంటి ఆణువణువూ ప్రతిధ్వనిస్తున్నాయి!
ఇక్కడే.. ఇక్కడే.. ఇనుప తీగెకు గుచ్చి ఉంచి
నేను నీకు రాసిన ఉత్తరాలు
నాకే ఇంకా ఇంకా వినిపిస్తూ
ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నావు!
ఇదిగో.. ఇక్కడే
నీ కుట్టు మిషను లయాన్విత ధ్వనులు
నా చెవులలో ఇంకా మార్మోగుతూ ఉన్నాయి
ఈ దారంటే సాయంత్రాలు ఇద్దరం
ఇప్పుడూ నడుస్తూనే ఉన్నాంగా!
నాలోనే, నాతోనే ఉన్నావుగా
మరి, నువ్వు లేవని
నన్ను చూసి జాలి పడతారెందుకు?
డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678