ఆశల రెక్కలు తొడుక్కున్న
మమతల ఊరు మమకారం
బలె బలే ఊరంటే పండుగ కదా!
అదేం చిత్రమో గానీ
నగరమంతా ఖాళీ ఖాళీ
ఉరుకుల పరుగుల ఊరి దారిన
సొంత వాకిలి కప్పూలేని
గదుల ప్లాస్టిక్ బతుకు నగరం
నవ్వని ఏడ్వని అపార్ట్‌మెంట్ బందీ
ఈ ఉడుకపోత ఆ కుండపోత నడుమ
బతుకు గజిబిజి బిజీ బిజీ
నదులు ప్రవహించే రోడ్లు విలవిల నగరం
సంకెల పంజరం రణగొణ విడిచి
ఊరెళ్ళడమే ఓ హడావుడి
పాట మురిసే అడుగేసే దరువూరై
ఊరు సన్నాయి తొలిచిందేమో
మది పరుగెత్తే నగరం దాటి
ఆటపాటల బాల్యం నవ్వే పండుగ
వదిలేసిన మమతల పొట్లం
మరువక విప్పుకొని రమ్మని పిలిచే
నునువెచ్చని చినుకుల వాన
మనిషి ఊరు బాట పట్టే
మనసూ దేహం చెట్టపట్టాలేస్తూ
బతుకమ్మ దసరా పండుగలకు
ఇల్లంతా మట్టి వాసన
పూల నెచ్చెలి గుండెగుండెల
అలాయ్ బలాయ్ ఊరూవాడ అందెలై
నా దేహంలో నా రక్తం
నాలో నా ఊరంచు గాలి ఊరించే
మమతల చేవ్రాలే ఊరి పండుగ గొప్ప
ఆనందాల వెల్లువలో వీధివీధి తనివితీరా
సేదదీరిన మనిషి చేరే రణగొణల నగరం మళ్లీ
దీనంగా యాంత్రికంగా విధిలేక
డా. టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871