అతడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తాడు
బ్రహ్మాండంగా కవిత్వం రాస్తాడు
కవితావేశం కోసం తెల్లవారుజామున
ప్రకృతిలో నడుస్తుంటాడు
పక్షుల కిలకిలారావాలు,
చల్లని పిల్ల గాలులు,
చుట్టు పక్కల ఇళ్ల లోంచి
వచ్చే సుప్రభాత గీతాలు
తన కవితారచనకు
భావనాబలాన్ని ఇస్తాయంటాడు
భాషను సౌందర్యవంతం చేయటానికి
బహు గ్రంథ పఠనం చేస్తాడు
అతడు పొద్దున్నే తెలుగు, ఇంగ్లీష్, హిందీ
త్రిభాషా దిన పత్రికలు ఆమూలాగ్రంగా చదువుతాడు
ఆ వార్తాప్రసారాన్నంతా ఆ గది లోంచి ఈ గది లోకి
హడావిడి పరుగులు పెడుతున్న
ఆమె కాళ్లకు చేతులకు అడ్డు పడుతూ
వింటోందా లేదా అన్నది పట్టించుకోకుండా
తన జ్ఞానాన్నంతా ఉదారంగా పంచుతాడు
రేడియో, టీ. వీ. స్మార్ట్ ఫోన్ ఎక్కడ
అవకాశమున్నా వదులుకోని జ్ఞానాన్వేషి అతడు..
అతడు ఉదయ వేళల చురుగ్గా, ఉత్సాహంగా,
ఎగిసిపడే సముద్రపు అలలా ఉంటాడు
ఆమె కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేస్తుంది
ఆమె కూడా కవిత్వం రాస్తుంది
తన జీవితపు నడకనే అర్ధవంతమైన
పదాలుగా కూర్చి నిరలంకార కవిత్వం రాస్తుంది
పుస్తకం చదవనిదే రోజు పూర్తవకూడదు
అనే నియమ నిర్వహణ కోసం
ఒక్క పేజీ అయినా చదివితీరుతుంది
రాత్రి పన్నెండు గంటలకు దిన పత్రిక
అటూ ఇటూ తిరగేసి
అమ్మయ్య!ఈ రోజు పేపర్ చూసాను
అనుకుంటూ తృప్తిగా నిద్రపోతుంది
సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు
పడమట అస్తమిస్తాడు
అన్నంత నిజం వారి మారని దినచర్య!
- డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678