ఓ చికెన్ గున్యా
నా సి(క్కు)న్నారి గువ్వా..
ఏ అందాల దోమ రాణి కన్నదో కానీ...
కాటేసి నిన్ను నా దాన్ని చేసింది.
ఏనాడు నే క్రీగంటనైనా చూసింది లేదే..
నీపై నాకు “క్రష్” అంతకన్నా లేదే...
అకస్మాత్తుగా...అర్ధరాత్రి పూట
నీకూ నాకూ ‘కెమిస్ట్రీ’ కుదిరింది.
పెడరెక్కలు విరిచి కట్టి ...
సకల అంగాల కీళ్ళను కదలకుండా పెనవేసుకున్నావు.
ఎంతటి భల్లూకపు పట్టు నీది
నీ బిగి కౌగిలిలో ...
నే బిగుసుకుపోయి
వారాలు, నెలలు గడచిపోతున్నాయి.
వాష్ రూంలో నీ లీలలు చెప్పతరమా...
కూర్చుంటే చేతాడుతో పైకి లేవాల్సిందే..
తాడునైనా పట్టుకోనిస్తావా
వంగని వేళ్ళకు తాడును మెలిక వేసి
కప్పీ సాయంతో లేవాల్సిందే
ఇండియన్ కమోడ్ పై ఒక్కసారి కూర్చొని లేస్తే చాలు
ఇంగ్లీష్ ఛానెల్ ఈదినంత గొప్ప.
నీవు ఎనలేని వ్యామోహంతో...
చక్కిలిగింతవై ఒళ్ళంతా పారాడుతుంటావు
నాకేమో ఎడతెగని దురదలయి
గోకడం కాదు.. కాదు...
గోడ కేసి రాకుతుంటాను.
పరి పరి విధములు నీ నాటు సరసం.
నువ్వు మన్మధ బాణమేస్తావు
అది నా నరాలను జివ్వున లాగి
పట్టి విడిచినట్లుంటుంది.
లబోదిబమనడమే ప్రతి చర్య.
ఓ సుందరాంగీ...
నా సిత్రాల గున్యా
ఏల నాపై నీ దయ పోదు.
నన్నేల.. ఏల... వదలి పోవూ.
- హెచ్.రవీందర్,
99122 33533