ద్వేష భక్తి గేయం

poem

Update: 2023-09-10 18:45 GMT

మతమునే ప్రేమించుమన్నా

హింసయన్నది పెంచుమన్నా

వట్టి మాటలే చెప్పుకోవోయ్

చేయు మేలుని కట్టిపెట్టోయ్

హిందూమతమే రాజ్యమేలగ

దారిలో నీవు పాటుపడవోయ్

తతిమ జాతులు మతములన్నీ

అణిగిమణిగి మెలగవలెనోయ్

దేశాభిమానమె నాకె కద్దని

వట్టి గొప్పలె చెప్పుకోవోయ్

దేశమంటే జనం కాదోయ్

దేశమంటే మతం మయమోయ్

స్వంత లాభమె అంత యనుకుని

ప్రజలనందరి ముంచవలనోయ్

జాతి ఆస్తులు కట్టగట్టి

దత్తపుత్రుల కట్టబెట్టోయ్

భక్తిరసమే పొంగి పొర్లగ

సోయ మరచీ మునగవలెనోయ్

ఆకలేసి కేకలేస్తే

తన్ని జైలుకి పంపవలెనోయ్

భక్తి పేరుతో దండుకొనె

సోమరిపోతుల పెంచవలెనోయ్

కాయకష్టం చేసి బ్రతికే

కర్మవీరుల దంచవలెనోయ్

విజ్ఞానమంతయు రాతియుగపు

గ్రంధమయమని బొంకవలెనోయ్

రోదసీ నౌకకి సైతం

దిష్టి టెంకాయ్ కొట్టవలెనోయ్

అంబేద్కరూ గాంధీ ఇజాలకు

పైపై డప్పు కొట్టవలెనోయ్

మతసామరస్యం చావు కోసం

లోన గోతులు తీయవలెనోయ్.

(ఇది గుజరాత్ అప్పారావు ద్వేష భక్తి గీతం)

- జ్యోతిబాసు

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం