తెలియనితనమో
తెలిసినతనమో
తెలిసీ తెలియనితనమో!
సంచారి జీవితాన్ని
గడుపుతున్నా
మాసిపోయిన చొక్కాలైనా
శిథిలమైన దేహాలైనా
నా కొక్కటే....
ఎప్పటికాలమో
యుగాలకు పూర్వం
ఎవరో నన్ను కౌగిలించుకుని
భూమిపై వదిలేసి వెళ్ళిపోయారు
ఆ కాలం నుండి
ఎంత తిరిగినా దేవుడే తప్ప
నేస్తమైన మనిషి జాడ
కన్పించలేదు.
సమూహంతో నైనా
నేను ఒంటరినే
నేను ఒంటరినైనా
నాతో సమూహాలున్నాయి
ఐనా... పరిపరివిధాల
పరిభ్రమించే మానసిక అవస్థ నాది
పురాకాలపు ఔషధాలేవి
నాకిప్పుడక్కర్లేదు
నేనిప్పుడు అంత్యకాలపు
మార్గాల్ని కనుగొన్నాను
ఇక దూరభారాలు
లెక్కలూ పత్రాలు
ఇవేవీ నన్ను తాకలేవు
వచ్చిన చోటుకే
నన్నిక్కడికి తెచ్చిన చోటుకే
మరలిపోతున్నాను
కొరుప్రోలు హరనాథ్
97035 42598