గాయాల గేయం

poem

Update: 2023-09-03 18:30 GMT

వంచితుల గాయాల కాలాన్ని గజ్జెలు చేసి

జజ్జనకరి జనారేకి చిందేసిన పాదాలు

అధికారం అహంకారపు అంధకారం మీద

క్షిపణులై కురిసిన నిప్పుల అక్షర పాదాలు

దట్టమైన ఆకుపచ్చని అడవి దళంలో

బండలను చీల్చుకునిపారే సెలయేటి గళం

పరవశానికి పులకరించి పల్లవించిన పాటే

ప్రశ్నించే వేళ నిలువెత్తు విప్లవ ఆయుధం

అలలు అలలుగా అలుపెరుగకుండా

సాగిపోయే పల్లె పచ్చి గుండెల పాట

పల్లేరుకాయల దారిని పరిచయం చేస్తూ

గేయాల నిండా గాయాల కంజీర జీర

అమ్మ పాటే తనకి ప్రాణం పోసిందో

అసలు పాటకే తను ప్రాణం పోసాడో

సలసల మరిగే ధిక్కార రక్తనాళాల్లో

ప్రవహించేదంతా పాట పాట పాట

పీడిత ప్రజానీకానికి కలగన్న తీరం చూపేందుకు

యుద్ధనౌకగా తనతోతాను చేసిన యుద్ధం ఎంతో

వీపులో కాపురమున్న బుల్లెట్ కు తెలుసు

సగం నిండి సగం కాలిన కడుపులకు

సమాధానం అడిగే ఈ దేశపు సగం జనాభాకి

ఆ సగం నగ్నదేహమే అసలైన ప్రతీక

విరామమెరుగని పోరాటంలో

విశ్రాంతి ఎరుగని సైనికుడు పాడిన

చివరి పల్లవికి చితికూడా మొదటిసారి

అసలైన ఆరిపోని దగడును లోకమంతా చిమ్మింది

జోహార్ గద్దర్ అన్న

పెనుగొండ బసవేశ్వర్

94411 59615

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం