కోట్ల కన్నుల కవాతు

poem

Update: 2023-09-03 18:30 GMT

తల్లులారా!

ధృతరాష్ట్ర పాలనలో

దుర్యోధన దుశ్శాసనులు

మిమ్ములను వివస్త్రను చేసి

ఊరేగిస్తుంటే మీ అంగాంగాలపై

కోట్ల కన్నులు కవాతు చేసాయి

గుండెల్లో బర్సెలు దిగుతున్న బాధ

గుండె ఉన్న అందర్నీ కదిలించలేదు

ఏదో ఒకనాడు మీ కన్నుల్లో

దాగిన కోపాగ్ని మిసైళ్ళయి

ఈ మృగాలను కూల్చక మానవు

చెర్చబడింది మీ దేహాలు కాదు

తల్లులారా! పాలకుల దేహాలు

ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు

సీత నుండి మీ వరకు

దుఃఖాలు తప్ప సుఖాలు ఎక్కడివి

శాసన సభలలో తలలు

తీయబడిన మొండాలు

పాలకులుగా ఉన్నాయి తల్లులారా!

నిన్నటి మీ నగ్న ఊరేగింపులకు

చెర్చబడి కాల్చబడిన

మీ దేహాలకు నిరసనగా

సభలలో సమావేశాలలో

చర్చలు చాలానే చేసాం

ఎంత దారుణం మృగాళ్ల క్రౌర్యం

ప్రజాస్వామ్య దేశంలో పుట్టినందుకు

ఇక ముందు నగ్న ఊరేగింపులు

అత్యాచారాలు జరగవని హామీలుండవు

నీతి శాస్త్రాలతో రాసుకున్న

మత గ్రంధాలు మీ శీలాలకు

రక్షణగా నిలవవు

క్రూరమృగాలను మించిన

మనుషుల కర్కశత్వాన్ని చూసి

జంతువులు కూడా తలదించుకున్నాయి

మనుషుల కన్నా తామే నయమని

(మణిపూర్ సంఘటనకు అక్షర నివాళి)

నారగొని ప్రవీణ్ కుమార్

98490 40195

Tags:    

Similar News

వెలుగు

పగటి వేషం