సగపెట్టని రోజు లేదు
సగం రొట్టె తిన్నందుకు
సగపెట్టని రోజులేదు
సగం రొట్టె సార్థకతకు
కాళ్ళునొచ్చో కళ్ళుగుంజో
కూర్చున్నది లేదు
కునుకు తీసింది లేదు
పని కసరత్తులో కాయం మోటుబారి
పని రసమత్తులో దేహం రాటుదేలి
ఇన్నాళ్లైనా అమ్మని
అనారోగ్యంతో చూడ్లేదు
పాత చింతకాయ పచ్చడిలా
పాతకాలం మనిషి
నిర్లిప్తానికి తావివ్వక వూడుస్తూ తూడుస్తూ
నిద్రణానికి చోటివ్వక వుతుకుతూ
ఆరేసిన బట్టల్ని తీస్తూ మడతెడుతూ
సదువైతేలేదు కానీ సాకిరికి సై
పదవైతే లేదు కానీ పనికి జై అంటూ
ఇంటిలో మరలా విసుర్రాయిలా గిరగిరా
మేం ఆలస్యమైతే
కంబళ కాళ కరాళ కందెన రాత్రిలో
కళ్ళల్లో ఒత్తులేసుక కవాటంలో కావలికాస్తూ
ఏమి ఆశ్చర్యమో మనసులో గూడుకట్టుకున్న
దిగుళ్ళన్నీ అమ్మ చూపుల్తో మటుమాయం
విసుగులులేని ముసుగులు వేయని
లొసుగులు తెలియని అమ్మ అమ్మే
అనంత అమృత ప్రేమమయి అమ్మే
స్పూర్తీకరణతో మూర్తీభవించిన
కరుణాసముద్ర అమ్మంటే
యుగాల సాగర విషాద ఘోషల
చెక్కుచెదరని ప్రగాఢ ముద్ర అమ్మంటే
కోటం చంద్రశేఖర్
94920 43348