సుఖ దుఃఖాల పంచాయితీలో
దుఃఖమే గెలుస్తుంది
తప్పదు మరి
అగ్గిపుల్ల సుర్రున వెలిగి ఆరిపోయినట్లు
అగర్ బత్తి సుదీర్ఘంగా కాలినట్టు
సుఖం స్వల్పాయుష్షు
దుఃఖానికి దీర్ఘాయుష్షు
అలాంటి దుఃఖం నాలోకి దిగిపోయి
ఆణువణువూ పాకిపోయి
సమస్త దేహమూ కుంగిపోయి
రందితో నిండిపోయి
అలసి సొలసి నిలబడ్డప్పుడు
లోన ఎక్కడో ఓ వాక్యం పుడుతుంది
నా పక్కన జేరి భుజం తట్టి
ఓ కవీ, ఆ దుఃఖాన్ని నాకిచ్చేయ్
నీ భారాన్ని దించేయ్ అంటుంది
వారాల ఆనంద్
94405 01281