కన్నీళ్లు నిండిన కళ్ళల్లో
ఆనందం చూపించేది
మసకబారిన మనసుకి
మమతలు పంచేది
ఒంటరిగా ఉన్న నీ
అంతరంగానికి తోడుగా నిలిచేది
నీ గుండెల్లో దాగిన
భావాలకు ఊపిరి పోసేది
ఆకాశంలో ఇంద్రధనస్సు
నీ అక్షరాలలో కనిపించేది
నీ నిట్టూర్పు, ఆవేదనలకు
చరమగీతం పాడేది
మకుటమే లేని మహారాణిలా
నీకు ఆప్యాయత పంచేది
కరిగిన మనసుకి లాలిపాట అయ్యేది
కనుమరుగవుతున్న ఆశయాలకు
జోలపాట అయ్యేది
ఓడినా నిన్ను విడువకుండా
నీ వెంటే ఉండేది
కనిపెంచిన తల్లి తర్వాత
ఆ స్థానాన్ని తీసుకునేది
అనుక్షణం అంటి పెట్టుకొని
నాన్నలా లాలించేది
కవిత్వమంటే
కరగని వెన్నెల
మరుమల్లెల కోవెల
ఆశల ఊయల
నా కవిత్వం ఆకాశంలో
విహరించే మేఘమాల...
పోలగాని భానుతేజ శ్రీ
98665 97260