టేబుల్‌పై బుంగి రాసుకున్న కాగితాలు గాలికి రెపరెపలాడాయి. నా దృష్టి వాటిపై పడింది. తీసి చదివాను. వింత చేష్టలు, వికృతాకారాలతో ఎక్కడ చూసిన వారే. నిర్లక్ష్యం, విచ్చలవిడితనంతో ఎటు చూసినా వాళ్ళే. ముద్దు-ముచ్చటగా కాదు. ముద్దులు-ముచ్చట్లతో వాళ్ళు. తెగిన గాలిపటంలా, గురి తప్పిన బాణంలా వారు. భయము-భక్తి లేక వీరు. కూలగొట్టడం- లేచివెళ్ళడం తెలిసిన వాళ్ళు. హద్దుమీరి ఆనందించే వాళ్ళు. ఆశయం-ఆచరణలు లేని మురికి వాళ్ళు. తల్లిదండ్రుల కష్టాల్ని చూడ నిరాకరించే పిల్లలు? రోడ్డున పడి-రోడ్డుకెక్కి, పుస్తకం వదిలి-తరగతి వీడి దివారాత్రులు సంచరించే విద్యార్థులు. నాలుగు దిక్కులా ఒకే లక్షణాలతో వీళ్ళు ఎవరో నేర్పినట్టు, ఎక్కడో నేర్చినట్టు, ఆడ-మగ తేడా లేకుండా ఏకరీతి ప్రవర్తనతో వాళ్ళు. వాళ్ళు-వీళ్ళు అనే తేడా చెరిపేస్తూ ముందుకు సాగుతున్నారు. నేటి విద్యార్థులే, రేపటి పౌరులు. నేటి పిల్లలే రేపటి యువకులు.
నిజమే అనిపించింది. నా పరిశీలనలోనూ ఇదే తేలింది. అన్నిచోట్ల నాకున్న అనుభవాలు, విద్యార్థుల మధ్యగల సారూప్యతను ఆవిష్కరించాయి. ఈ గుణాలు వారిని ముందుతరం దూతలుగా నిలుపగలవా? లేక విచ్ఛిన్నకర శక్తులుగా మార్చగలవా? అనే అనుమానం వెంటాడుతుంది. నాలాంటి మానసిక స్థితే బుంగికి కూడా అని మరొక్కసారి రుజువైనందుకు సంతోషమనిపించింది.
విద్యపేరున తిరుగక విలువ విడిచి
శ్రద్ద లేకున్న చదువులు సరిగా రావు
మురికి చేష్టలు ఒసగును ముసలితనము
కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము
డా. బి.వి.ఎన్ స్వామి
92478 17732