నేలన పాకుతూ పరవళ్ళు తొక్కుతూ
హొయలు పోతూ గంతులు వేస్తుంది నది
సముద్రంలో కలుస్తానని తెలిసీ!
చిగురించిన ఆకు రాలిపోతానని తెలిసీ
పండు రంగులు పులుముకుంటుంది
కొమ్మతో అనుబంధం అంటిపెట్టుకుంటుంది!
రాత్రయితే చీకటి వస్తుందని తెలిసి
పగలు ఎన్నడూ వేదన చెందదు
వెలుతురులు ప్రసరించక మానదు!
కత్తుల బోనయినా నిప్పుల దారి అయినా
ఎత్తులతో నెత్తురు లేకుండా నిలబడగలగాలి
తప్పని నియమంతో పూల దారి అవుతుంది!
శిశిరం తర్వాత వచ్చేది వసంతం
రాలిన ఆకు నిలిచిన చెట్టుకు
మళ్లీ పుట్టి ఆశలను చిగురిస్తుంది!
జననం వెనుకే మరణమున్నదనీ
గమనించీ మరోజన్మ వరకు గమనాన్ని
ఆపకుండా కొనసాగేది జీవితం!!
జగ్గయ్య. జి
9849525802