నువ్వెళ్ళిపోయా

poem

Update: 2023-07-02 18:30 GMT

నువ్వెళ్ళిపోయాక

ఒక కిరణం దిశ తప్పి

దశను మార్చుకుని వెళ్ళింది

ముసురు కమ్మిన మస్తిష్కం

మసకబారిపోయింది

ఒక వసంతపు కాంతి పుంజం

చీకటితో చేయి కలిపినట్టు

పత్రాలుగా రాలిపోయింది

నువ్వెళ్ళిపోయాక

దిక్కులన్నీ ఒక్కటై కూడినట్టుగా

మూలాలన్నీ చెదిరిపోయి

హద్దులన్నీ తిరగబడినట్లు

మనసు స్థిరత్వం కోల్పోయింది

నువ్వు దూరమైపోయాక

ఆకల్ని మింగిన ఆలోచనొకటి

నిస్సారవంతమైన నేలపై పడుకుని

కలలకు మేత వేస్తూ

కడపటిదాకా నిరీక్షిస్తోంది

జ్ఞాపకాల సంద్రంలో

మునిగి తేలిపోతూనే

కెరటాలుగా మననం ఎగిసిపడుతోంది

నువ్వెళ్ళిపోయాక

లోకం మాయమైపోయినట్టు

శూన్యం చుట్టూ ఆవహించినట్టు

విరహవేదన పడగల కింద

దేహం మౌనంగా కూర్చుంది

మళ్ళీ వస్తావని

ఆశల్ని పోగు చేసుకుని

జాడకు ఎదురేగుతోంది

నరెద్దుల రాజారెడ్డి

96660 16636

Tags:    

Similar News

వెలుగు