నా తెలుగు భాష

poem

Update: 2023-07-02 18:30 GMT

నా తెలుగు భాష,

అజంతాల అందం

దిగంతాల గంధం

సంపూర్ణ వర్ణమాల

పరిపూర్ణ గేయబాల

నా తెలుగు భాష,

అచ్చుతప్పు లేని అచ్చులు

హలంపట్టిన హల్లులు

కలిసిఉండే సంయుక్తాక్షరాలు

విడిపోని ద్విత్వాక్షరాలు

నా తెలుగు భాష, హృదయాల సంగమ సంధులు

అనుభూతుల సమ్మేళన సమాసాలు

మనోభావాల నిగ్రహ విగ్రహ వాక్యాలు

నిర్మల మనస్సుల ఛందస్సులు

నా తెలుగు భాష,

సూర్యోదయపు ఉషస్సులు సూర్యాస్తమయపు నమస్సులు

మహనీయుల ఆశీస్సులు

కారణజన్ముల తపస్సులు

నా తెలుగు భాష,

అలంకరణే అవసరం లేని అలంకారాలు

వర్ణించనలవి గాని నయగారాలు

పద్య, గద్య, గేయ రచనల పొదరిల్లు

నిత్య సాహితీ పరిమళాలు వెదజల్లు

నా తెలుగు భాష

నీతులు బోధించే శతకాలు

బహు రీతులు సాధించే పతకాలు

మహాకవుల కవనాలు

పురాణేతిహాసాల గమనాలు

నా తెలుగు భాష,

సార్థకమైన అర్థోక్తులు

సందర్భోచిత ఛలోక్తులు

బాసల, యాసల, గోసల మమకారాలు

వేలుపట్టి నడిపించే నుడికారాలు

అందుకే అంటాను

దేశభాషలందు తెలుగు లెస్స

ప్రపంచ భాషలందు తెలుగే హైలెస్స

-సయ్యద్ ఖాసీం అలీ


Similar News

వెలుగు