మామిడి తోట విరగకాసింది. తోటమాలి ఒంటినిండా కళ్ళు చేసుకొని తోటను కాపాడసాగాడు. ఒకరోజు ఆ తోట బుంగి కంటపడింది. నోరూరించి భయంభయంగా చెట్టెక్కి పళ్ళు కోసుకుని దిగి వెళ్ళసాగాడు. దూరం నుంచి చూసిన తోటమాలి గబగబా వచ్చి బుంగిని పట్టుకున్నాడు. ‘దొంగతనంగా పండ్లు తెంపడం తప్పుకాదా’ అన్నాడు. ‘పండ్లు తినాలనిపించింది తెంపాను’ గడుసుగా అన్నాడు. ‘మంచి మాటలతో చెప్తున్నా, ఇంకోసారి ఇలా చేస్తే దెబ్బలు తప్పవు’ అని హెచ్చరించాడు. మరునాడు తోటమాలి, కాపలా కోసం ఇంటి నుండి బయలుదేరి, బుంగి ఇంటి ముందు వెళ్ళాడు. వెనక నుండి బలంగా ఒక రాయి వచ్చి తాకింది. ‘అమ్మా’ అంటూ వెనక్కి తిరిగి చూసాడు. పరుగెత్తుతూ బుంగి కనిపించాడు.
బుంగి కోసెను పండ్లను బుగులు తోడ
మాలి చెప్పెను బుద్ధియు మాలిమిగను
వినరు పిల్లలు మదమున వినతి మాట
కశప చెప్పిన కధనమ్ము కాంతి పధము
డా. బి.వి.ఎన్ స్వామి
92478 17732