ఉధృతంగా సాగుతోంది సమ్మె. విఫలం చేయాలని ప్రైవేటును ప్రయోగించింది ప్రభుత్వం. ఆర్‌టీసీ బస్సులో ప్రైవేటు ఉద్యోగులు చేరారు. ప్రతిపక్షాలు సమ్మెను సమర్థించాయి. సంస్థ నష్టాలకు నువ్వంటే నువ్వు కారణం అని ఇరువర్గాలు దుమ్మెత్తి పోసుకున్నాయి. ప్రయాణికుడి జేబు చిల్లుపడింది. ప్రతిష్టకు పోయింది యూనియన్. పట్టు బిగించింది ప్రభుత్వం. 'తెలంగాణ బంద్' అంది యూనియన్. కార్మికులందరు 'సెల్ఫ్ డిస్మిస్' అంది ప్రభుత్వం. ఆందోళనలో గుండెపోటుకు గురయ్యారు కొందరు కార్మికులు. 'జీతాల్లేవ్' అనడంతో మంటల్లో మసయ్యారు ఒకరిద్దరు. యూనియన్ మరియు ప్రభుత్వం మధ్య జరిగే ఆటలో ప్రజలు పావులుగా మారుతున్నారు. చర్చలు జరపండి అంది కోర్టు.
'ప్రైవేట్ ఉద్యోగులను అడ్డుకొందాం' 'పోలీస్ అరెస్ట్‌లను స్వాగతిద్దాం' 'సంఘటితంగా పోరాడుదాం' ఇలా ఎవరికి తోచిన అభిప్రాయాన్ని వారు చెబుతున్నారు. అన్నింటిని విని 'గాంధీగిరి' చేద్దాం అన్నాడు బుంగి. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లు తమ పని తాము చేసుకుంటున్నారు. సమ్మె చేస్తున్న కార్మికులు వారికి పూలు, పండ్లు ఇచ్చి మొక్కినారు. ఆ సమయంలో పూలు తీసుకున్న లేడీ కండక్టర్ వాటిని తలలో తురుముకుంది. తన పని తాను చేసుకుంది.
సమ్మె కోసము సాహసించి
నడుము బిగియించరెపుడు నగుచు ఇలను
కడుపు కాలిన సమ్మెకు కాలు దువ్వు
కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము.
డా. బీవీఎన్ స్వామి
92478 17732
Also Read...
సమీక్ష: తెలంగాణ వైతాళికుడు సురవరం మనవరం