నల్లని బురఖాలో వచ్చిన సిస్టర్ జుబేదాది తెల్లని పావురమై పోతుంది! ‘‘జుబేదాది కహాహై’’ అన్కుంట గర్భిణులు లేబర్ రూంలకి పోతరు. లేబర్ రూంల నైతే ఆడోల్ల ఆర్తనాదాలు జుబేదాది మాటలతో చిరునవ్వులవుతాయ్. ‘‘సబర్ కరో బీబీ..థోడే దేర్కే బాద్ చాంద్ కే జైసే బేటీకో దేఖోగి’’ అంటుంది. కొన్నాళ్ల తర్వాత ‘‘నీంద్ కే గోలియా ఖాలీ డాక్టరమ్మ ఆప్ కీ జుబేదాది’’ అని ఆమె తల్లి ఏడ్చుకుంట వచ్చింది. ‘‘మొన్ననే కదా తన చిన్నప్పటి స్నేహితుడు, కోరుకున్న అజహర్‌తో నిఖా అయి బెహరైన్ వెళ్ళిపోతనన్నది!’’ అంది డాక్టరమ్మ. ‘‘హా మేడం.. అజహర్‌కి వసీంతో మూడేండ్ల కిందనే పెండ్లి అయ్యిందంట. ఆమెకు మూడో నెల." జుబేదాబితో వచ్చిన వసీం గర్భ సంచీని సాఫ్ చేస్తుంటే మొత్తం వ్యవస్థను శుభ్రం చేస్తున్నట్టనిపించింది డాక్టరమ్మకు. గీతాంజలి రాసిన ‘ఊరికి పోదాం భూదేవి’ కథా సంకలనంలోని ‘బచ్చేదాని’ (గర్భసంచి) కథ ఆస్పత్రిలో ముస్లిం స్త్రీల విషాద గాథలను వినిపిస్తుంది. ఈ కథను కేంద్ర సాహిత్య అకాడమీ వారు ఇంగ్లీషులోకి అనువాదం చేశారు.
శివమెత్తిన శివాని
పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్న శివాని కోచింగ్ క్లాసులకు వెళ్ళలేదని చెంప చెళ్లుమనిపించాడు దినకర్. ‘‘సాయంత్రం నీవు కోచింగ్‌కు వెళుతున్నావ్’’ అన్నాడు. ‘‘గ్రామర్ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్‌కు వెళుతున్నా’’ అంది ధిక్కారంగా. గ్రామర్ స్కూల్లో జానపదాలు, డోలు చప్పుళ్లు, లయగా కల్తీలేని సంగీతం. శివాని ఇంట్లో పనిచేసే ఎల్లమ్మ అక్కడ మెల్లిగా ఊగసాగింది. కళ్లు విచ్చుకున్నాయి. క్షణంలో జుట్టు విరబోసుకుంది. శివాలెత్తినట్టు ఆడసాగింది. ఎల్లమ్మలో ఒత్తిడికి ఇదొక ఔట్ లెట్! నిరంతరం శ్రమ..దోపిడీ..ధన దాహాల మధ్య ఎల్లమ్మ పడుతున్న మానసిక వేదన. ‘‘శివాని..రాత్రి నిన్ను అనవసరంగా కొట్టాను’’ అన్నాడు దినకర్ . దగ్గరకు రాబోతున్న అతని చెంప చెళ్లు మనిపించింది శివాని. ‘'ఇరవై ఏళ్లాయె మీ అయ్య మన పొలం కాడ గట్టుమీద మన్నుల సల్లగ నిద్రపోవట్టె. మీ అయ్య ఎట్లుండో ఏమో..ఓ సారి చూసొద్దాం ఊరికి పోదాం భూదేవి’’ అంది ఎల్లమ్మ. ‘ఊరికి పోదాం భూదేవి’ కథలో ఇలా దు:ఖభారాల సన్నివేశాలు ఊపిరాడనివ్వవు.
బోన్సాయ్
వృక్ష శాస్త్రజ్ఞుల చేతుల్లో పడి ఒక చిన్న కుండీలో మరుగుజ్జులా కుదించుకుని దీనంగా కన్పించింది బోన్సాయ్ మర్రిచెట్టు. ఊర్మిళకి నోట్లోంచి ధారాళంగా వెలువడే వృక్షశాస్త్ర విషయాల బదులు ఇప్పుడు ఇడ్లీలు, దోశలు, పెసరట్లు, ఉప్మాలు, మటన్ కూర, చపాతీలు, ఏరియల్, రిమ్, ఇస్త్రీ బట్టలు మాత్రమే వస్తున్నాయి. కుండీని పగలకొట్టి బోన్సాయ్ మర్రిచెట్టుని నేలపై పాతిపెట్టి నీరు పోసింది. మర్నాడు ‘‘ఎక్కడికి’’ అన్నాడు సుధాకర్. ‘‘కాలేజీకి’’ అంది శివాని. భర్త ఆధిపత్యాన్ని ధిక్కరించే ఇల్లాలిని ఆవిష్కరించే ‘బోన్సాయ్’.
కలలు -చేదు నిజాలు
‘‘నేను రాయమన్నదేంటి? నువ్వు రాసిందేమిటి? నైట్ బజార్‌ని గ్లోరిఫై చేస్తూ రాయమంటే.. బాల్య వేశ్యలు.. కన్నీళ్లూ.. మాంస వ్యాపారం.. ఇదా రాసేది? ప్రజా ఉద్యమాలు.. అణచివేతలు.. ఆత్మహత్యలు.. ఏమిటిదంతా.. నానా చెత్తా రాసి నా మొఖాన కొడ్తావా? యూ ఆర్ డిస్‌మిస్డ్..గెట్ లాస్ట్..’’ పిచ్చెక్కిన కుక్కలాగా అరుస్తున్నాడు ఎడిటర్. నిజాయితీ గల జర్నలిస్ట్ కనే కలలు ఎలా ఉంటాయి, వాస్తవ జీవితం ఎలా ఉంటుందో సజీవంగా తెలిపే ‘కథ 2020’.
కళ్ల కాంతిని పెంచని ఫేషియల్
కుంచె పట్టాల్సిన విశాల చేతులు గరిటెలు పట్టాయి. ఇద్దరు పిల్లలకే ఆమె శరీరం లావెక్కింది. ‘‘నువ్వు విశాలవేనా? ఆ మొఖం ఏంటీ? కళ్ళ కింద ఆ నల్లని చారలేంటి?’’ అంది స్నేహితురాలు. ఫేషియల్ చేయించుకున్నాక మొఖం నున్నగా తయారైనా, తన కళ్లు చచ్చిన చేపల్లా ఉన్నాయి! అత్తమామల మూతి విరుపులు, భర్త బెదిరింపులు లెక్క చేయక విశాల డ్రాయింగ్ టీచర్ ఉద్యోగంలో చేరిపోయింది. స్త్రీల ఆత్మవిశ్వాసాన్ని, కళ్ళలో కాంతిని పెంచేది ఫేషియల్ కాదు, తన కాళ్ల పైన తాను నిలబడేలా చేసే ఉద్యోగం ‘ఫేషియల్’లో చూడవచ్చు.
తనకున్న పని తినకున్నా తప్పదు
సరళకు టైఫాయిడ్. భర్త నరేష్ ఆమె నుదుటిపైన చేయి వేసి ‘‘జ్వరం అస్సలు లేదు. ఇంక లేచి పనులు చేసుకో..అమ్మకు కష్టంగా ఉంది.’’ అన్నాడు. పనిమనిషి రాధతో వంటింట్లోనే నులక మంచం వేయించుకుని దానిపై ఒరిగింది సరళ. రోగమొచ్చినా తనకున్న పని తినకున్నా తప్పని సగటు ఇల్లాలి నిస్సహాయతను సజీవంగా చూపించే కథ ‘వంటింట్లో నులకమంచం’. స్వయంప్రభను భర్త, అత్త, మామలు కిరోసిన్ పోసి తగలపెడతామంటారు. పుట్టింటికి వెళితే ఎందుకొచ్చావంటారు. స్నేహితురాలింటికి వెళ్లి భర్తకు విడాకుల నోటీసులు పంపుతుంది ‘స్వయం ప్రభ’లో. సంగీతం చెప్పే వెంకటేశ్వరరావు పుట్టు గుడ్డి. ‘‘ఇదిగో ఒసేయ్ నిన్నే’’ ‘‘నీ మొహం మండా’’ ‘‘నీ మొహం.. నీకేం తెలుసు’’ ‘‘లోనికి తగలడు’’ ‘‘మూగి మొద్దా’’ అని భార్య రాణిని అంటాడు. భార్యకి, అతని చేతికర్రకీ తేడా లేదని ‘గుడ్డివాని చేతికర్ర’ చూపిస్తుంది. ఒక ఆడ కూలీ చెట్టుకింద పిల్లకి పాలిచ్చి మూతి తుడుస్తోంది. రెండు స్తంభాలకు కట్టిన తాడుతో కట్టిన జోలెలో బిడ్డను వేసి ఊపుతోంది. శ్రీకాంత్ రావుకు గడ్డకట్టే చలిలో ఎక్కడపడితే అక్కడ బారసాలలు కనిపిస్తాయి. అతను శేఖర్ రెడ్డి ఇంట్లోకి వెళితే పట్టు చీరల తళుకు బెళుకులు, చెంపలకి రాసుకునే పింకీలు, పెదవులకి లిప్‌స్టిక్‌లు. మూణ్ణెల్ల పిల్లవాడికి ఉక్కిరి బిక్కిరయ్యే బంగారు గొలుసులు, ఉంగరాలు, పట్టుబట్టలు. అభివృద్ధి వెనుక హింసను చూపించే ‘చీకట్లోంచి చీకట్లోకి’
బాధలు- విషాదాలు
విమలకున్న నెలల బిడ్డను చూసుకోవడానికి పదేళ్ల చిట్టిని తీసుకొస్తారు. ఈ ఇంట్లో సౌఖ్యాల కంటే తన జాతి ఉనికే ముఖ్యం. ఆ బాలిక వెక్కిళ్ల రాగంలో తల్లి కోసం, తన తండా కోసం, ఆ మట్టి వాసన కోసం ఆ పసి హృదయపు వేదన ‘యాడి’(అమ్మ)లో వినపడుతుంది. వీధి కుక్కలను వ్యాన్లలోకి ఎక్కిస్తున్నారు. అడుక్కుంటున్న బిచ్చగాళ్లను కూడా రెక్కలు, కాలర్లు, జుట్టు పట్టుకుని ఈడుస్తూ వ్యాన్లలోకి పడేస్తున్నారు. ప్రపంచ పోలీస్ క్లింటన్ దొరగారి హైదరాబాద్ పర్యటనలో ‘గరీబోంకా హఠావ్’... ‘బిచ్చగాడు లో కనిపిస్తుంది. అమ్మకు బాగుండకపోతే వెళ్ళి చూసిరావడానికి ససేమిరా అంటాడు రామకృష్ణ. ‘‘మమ్మీ అంటే ఏంటి? పిరమిడ్ అంటే ఏమిటి?’’ అడిగింది పూజిత. ‘‘పిరమిడ్స్ అంటే పెళ్లైన ఆడవాళ్లుండే మెట్టినిళ్లమ్మా. మమ్మీలంటే ఇదిగో ఈ ఇంట్లో అమ్మమ్మ, మనింట్లో నేను, రేపు నువ్వు మమ్మీలమే’’ అంటూ వణుకుతూ చెప్పింది పూజిత తల్లి ‘మమ్మీ’లో. ‘ఊరికి పోదాం భూదేవి’ కథల సంపుటి ఒక్కో కథలో ఒక్కో వైవిధ్య విషాద గాథని చూపిస్తారు గీతాంజలి.
పుస్తకం పేరు : ఊరికి పోదాం భూదేవి
రచన : గీతాంజలి
పేజీలు : 200
వెల : 200
పుస్తకాలకు : గీతాంజలి 88977 91964
పరిచయకర్త
రాఘవ
94932 26180