మనసును కదిలించిన సెల్‌ఫోన్ సంఘటన..

Update: 2023-02-27 13:16 GMT

చిన్నాచితక పనులు ముగించుకొని.. ఇంటికి వెళ్లే క్రమంలో.. నిన్న రాత్రి బాగా పొద్దుపోయినంక.. రోడ్డు పక్కన ఓ అరటి పండ్లు అమ్మే బండి కన్పించింది.

వట్టి చేతులతో ఇంటికి పోతే బాగోదు.. కాసిన్ని అరటిపండ్లు కొనుక్కొని పోదామని... ఆ బండి దగ్గర.. నా బండి ఆపి.. దిగి పండ్లు తీసుకునే సమయంలో.. కాసింత... సోది యవ్వారం మొదలైంది.. పండ్లు అమ్మేటాయనతో..!

"అవునుగనీ..! రేత్తిరి పది అయితుంది.. ఇంకా భేరం చేస్తున్నవ్.. గిప్పుడెవ్వడే.. పండ్లు కొనేది.." అని అడిగిన ఊకోబుద్దిగాక..!!

"యవ్వడో ఒకడు.. యనకముందోడు ఉంటడుగా.. మీ అస్సొంటోడు..." అన్నడు యమ్మటే...! "అమ్మా.. పంచ్ పడ్డదిరా..!!" అనుకున్న..

*మరేగనీ.. ఏమనుకోకు అన్నా.. ఏదో అట్ల అన్నగని.. అంటూ.. మల్లా ముచ్చట షురూ.. చేసిండు.. సరెసరే అని.. వెళ్లిపోబోతుండగానే..

"అన్నా... ఒక్క మాట.." అని పిలివగానే.. పోబోయి.. మళ్లా.. ఆగిన...

ఇగ.. సెప్పటం మొదలుపెట్టిండు..

"ఏం చేయమంటరు..

పొద్దుగాల ఇంటికి పోతే...

ఇంట్లో.. యవ్వల పనిలో ఆల్లు ఉంటుండ్రు...!! టీవీ చూసేటోళ్లు టీవీ... సెల్లు గెలుకేటోళ్లు సెల్లు.. తలో మూలకు కూసుంటరు...."

"కనీసం.. ఇంటికి పోగానే.. కడుపార మాట్లాడేటోల్లే లేరు. ఒకరిని ఒకరు పట్టించుకున్న పాపాన పోవట్లే. ఎవ్వల కోసం సార్...! రోడ్డెమ్మటి బండి పెట్టుకొని.. ఎండల.. వానల.. చలిల.. దుమ్ముల.. ధూళిల కష్టపడేది..? కుటుంబం కోసమే గదా...! మరి... వాళ్లే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే... నా పాణం ఏమనిపిస్తదో సెప్పురి..!" అన్నడు. ఇంటోళ్లు మాట్లాడే సందర్భం ఉందంటే ఇదొక్కటే...!!

అదీ.. ఏంటిదో ఎరికేనా..!! పాకెట్ మనీ కావాలని... ఇంట్ల డబ్బులు ఇచ్చిపో... అని..! డబ్బులే గానీ.. మాట.. మంచి వద్దా...? అని ప్రశ్నించాడు. ఇవ్వన్ని చూసి అందరు పన్నెంకనే ఇంటికి పోవాలనుకున్న అన్నడు.

ఇంకా ముచ్చట సాగిస్తూ... ఒకప్పుడు.. ఇంట్లో ఉన్నోళ్లం అంతా.. కలిసి కూర్చొని బువ్వ తినేది. ఉన్నదాంట్లో.. కారం అయినా.. పచ్చడైనా.. కడుపు నిండా తిని.. ఆప్యాయత అనురాగంతో ఉండి.. మంచి చెడు విచారించుకుంటూ...

సంతోషంగా బతికేది. మరీ ఈ మధ్య కాలంలో... కుటుంబాల్లో ప్రేమలు పోయినయ్..! ఇది... నా ఒక్కని పరిస్థితి కాదు... చానా ఇండ్లళ్ల ఉన్నదే...!" అంటూ. కాసింత ఆవేదన వ్యక్తం చేసిండు.

టెక్నాలజీ.. మంచిదే. కానీ, గియ్యన్ని చూస్తుంటే... పాత రోజుల్లోనే ఆప్యాయత బాగుండేది. అందరి మధ్య మంచి సంబంధాలు ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్లతో మాట్లాడటం చేతకాదు కానీ... ఎక్కడో దూరంగా ఉన్నోళ్లతో ముచ్చటేస్తుండ్రు అంటూ.. నిట్టూర్చాడు.

కరోనా లాంటి భయంకరమైన రోగాలు వచ్చి... ఇట్ట చూసినోళ్లు అట్ల " శ్రద్ధాంజలి " అంటూ... ఫ్లెక్సీలల్ల కన్పిస్తున్నరు. వాటిని చూస్తుంటే... కన్నీరొస్తుంది. ఎవ్వలకు ఎప్పుడు ఏమైతుందో.. తెల్వట్లే..!! అంటూ...మంచి రోజులు వస్తాయేమో సూడాలె.." అని అన్నడు ఆయన.

ఇది నా ఒక్కని బాగోతం కాదు.. అందరికీ ఎక్కువ శాతం ఇదే పరిస్ధితి అంటూ...ఇగ పొయిరా అన్నా... చానాసేపు ముచ్చట విన్నవ్.." అని రెండు పండ్లు కొసరు ఏసిండు.

తీసుకొని ఇంటిపోయేసరికి... ఇంటికాడ అందరు నిద్రపోయారు

ఇది నాకు ఎదురైన యథార్థ అనుభవం. తరుగుతున్న మానవ విలువల పై... కాస్త ఆలోచించవలసిన అవసరం ఉందన్న ఉద్దేశ్యంతో.. ఈ చిన్న సంఘటన మీ ముందుంచే ప్రయత్నం చేసిన.

థ్యాంక్యూ 🙏🙏

బొల్లెద్దు వెంకట్ రత్నం

(బి.వి.ఆర్.)

సూర్యాపేట

సెల్ : 9963616381



Tags:    

Similar News