భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. ఎలాంటి జాతి, మత, కుల, వర్గ వివక్ష లేకుండా అందరూ సమైక్యంగా జరుపుకునే పండుగ. మన సంస్కృతికి ప్రతిబింబంగా ఉంటూ జగతిని జాగృతం చేసే ఈ పండుగ మానవ జీవితంలో వెలుగులు నింపేది. దీపావళి అంటే దీపాల వరస. చీకట్లను పారద్రోలి తమ జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రమిదలలో తైలం పోసి దీపాల వరుసను పెడతారు. ఈ దీపావళి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది.
నరకాసురుని మీద గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటాం. ఆబాలగోపాలం కొత్త బట్టలు ధరించి గుమగుమలాడే పిండి వంటలు, టపాకాయల శబ్దాలతో ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. నరకాసురుడిని సంహరించిన తర్వాత జరుపుకునేది దీపావళి అని మనకు ఇతిహాసం చెప్పిన కూడా, దీపావళి రోజే లక్ష్మీదేవి పుట్టిందని, లక్ష్మీ విష్ణువుల వివాహ దినం అంటూ, రాముడు అయోధ్య చేరిన దినంగా, పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యంలోకి ప్రవేశించిన దినంగా రకరకాలుగా చెప్పుకుంటారు.
ఇంతటి ప్రశస్తమైన దీపావళి పండుగ గురించి సంకలనం వెలువరించారు సరస్వతీ సంసేవక బిరుదాంకితులు శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్ గారు. వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది కవులతో ‘దీపావళి’( కవితా సంకలనం) వేయడం హర్షించదగ్గ విషయం. ఇందులోని ప్రతి కవితలు దీపావళి విశిష్టతను గొప్పతనాన్ని చాటిచెబుతాయి. అంతేకాకుండా కొంతమంది కవులు రకరకాల పద్యాలతో కూడా దీపావళి వెలుగులను వివరించారు.
దీపావళి విశిష్టత చెబుతూ..
దివ్య దీపావళి భవ్య దీపావళి/ ఉల్లాస ఉత్సాహ ఉత్సవమని/ మదిలోని చీకట్లు హృదిలోని చీకట్లు/ తీసివేయునది దీపశ్రేణి యనుచు అంటూ డా. రాపోలు సత్యనారాయణ గారు ‘దివ్వెల పండుగ’ శీర్షికతో చక్కటి సీస పద్యంలో దీపావళి విశిష్టతను వివరించారు. అలాగే, ఆశ్వయుజ అమావాస్య అందమైన పండుగ/ సౌభాగ్యం సౌజన్యం మన దీపావళి పండుగ అంటూ అని షేక్ బాషా గారు ‘దీపావళి నాడు- నేడు’ కవితలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. అలాగే, చిచ్చుబుడ్లు, కాకరత్తులు, లక్ష్మీ బాంబులు అన్ని కన్నుల విందే కానీ ఎక్కువైతే అని సిద్దిపేటకు చెందిన మల్లెముల కనకయ్య గారు ‘దీపావళి’ కవితలో తెలియజేశారు.
అలాగే పాత సంప్రదాయం పొద్దున్నే లేచి/ స్త్రీలు వాకిట్లో రంగవల్లులు తీర్చిదిద్ది/ పిల్లలకు నూనెలతో మర్దన చేసి/ తలంటి స్నానాలు చేయించేవారు అంటూ దీపావళి పండుగ వాతావరణంను హైదరాబాద్‌కు చెందిన గజవెల్లి సత్యనారాయణ స్వామిగారు ‘చీకటి వెలుగులో’ వివరించారు.
నాటి దీపావళి నేటి దీపావళి/ తారతమ్యము చూడతరము కాదు/ చక్కనాచరణంబు సాంప్రదాయములతో/ ఉమ్మడి కుటుంబం ఉత్సవం అంటూ యనుచు సంపాదకులు శ్రీ చరణ్ దాసుగారు సీసమాలిక పద్యంలో ‘బంధు ప్రేమలు భారమయ్యే’ అంటూ కన్నులకు కట్టినట్లు వివరించారు.
ఇలా ఎంతో గొప్పగా దీపావళి విశిష్టతను చెప్పే 26 మంది కవులతో సంకలనంగా వచ్చిన దీపావళి కవితలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి వున్నాయి. చక్కటి పద్యములతో కవితలతో పాఠక ప్రియులను ఆకట్టుకునే విధంగా ఇది తీర్చిదిద్దబడినది. ఇలాంటి సంకలనాలు మరెన్నో సాహిత్య లోకానికి అందించాలని వేముల శ్రీ చరణ్‌ని కోరుకుంటూ కవులకు, సంపాదకులకు అభినందనలు తెలుపుదాం. ఈ పుస్తకంలోని పేజీల సంఖ్య 26. పుస్తకం వెల 60 రూపాయలు.
పుస్తక ప్రతులకు:
వేముల శ్రీ వేమన శ్రీ చరణ్ సాయి దాస్
భారత్ నగర్, సిద్దిపేట, 502103
9652256429
సమీక్షకులు:
యాడవరం చంద్రకాంత్ గౌడ్
94417 62105