జంతు పాత్రలతో కథలు రాసే బాల సాహితివేత్తలలో పైడిమర్రి రామకృష్ణ ముందు వరుసలో ఉంటారు. గతంలో ఆయన 3 బాలల కథా సంపుటాలు జంతు పాత్రలతోనే ముద్రించటం విశేషం. ఇప్పుడు ‘తాంబేలు ఇగురం’ కూడా బాలల కథా సంపుటే. ఇందులో కూడా జంతువులు, పక్షులే ప్రధాన పాత్రలు. అయితే, కథా వస్తువులు నేటి తరానికి చెందినవి కావటం విశేషం. ఈ కథల సంపుటిలో మొత్తం 30 కథలు ఉన్నాయి. మొదటి కథ 'ఎత్తుకెదిగిన కోతి' చివరి కథ 'తాబేలు దృఢ నిశ్చయం'. ఈ సంపుటిలోని రెండవ కథనే 'తాంబేలు ఇగురం'.
పుస్తకానికి పెట్టిన శీర్షిక తెలంగాణ మాండలికంలో ఉన్నప్పటికీ ఇందులో కేవలం 'తాంబేలు ఇగురం' కథ మాత్రమే తెలంగాణ సరళ మాండలికంలో ఉంటుంది. అన్ని ప్రాంతాల బాలలకు తెలంగాణ యాస, పదాల సొంపు పరిచయం చేయాలన్న ఆకాంక్షతో కేవలం ఒక కథను మాండలికంలో రాశారు. ఈ సంపుటిలోని కథలన్నీ కూడా బాలలకు వ్యక్తిత్వ వికాసాన్ని అందించేలా ఉంటాయి. ఈ కథలన్నీ గతంలో వివిధ బాలల శీర్షికలలో ప్రచురించబడినవి. పిల్లలు సొంతగా చదువుకునేలా ఉంటాయి. భాష చాలా సరళంగా ఉంటుంది. కఠిన పదాలు చాలా తక్కువగా వాడారు. 'అసలు పోటీలో పాల్గొనని వారికే ఓటమి ఉండదు' అని తెలిపే కథ 'తాంబేలు ఇగురం. 'మనమంటే ఇష్టం లేనివారు, మనకు నచ్చని వారు ప్రతిచోట ఉంటారు. అలాగని ఆ చోటుని వదలకూడదు. నచ్చని వారిని మన తెలివితో మిత్రులుగా మార్చుకోవాలి. లేదా దూరంగా ఉంచాలి!'అని చెప్పే కథే 'తాబేలు దృఢ నిశ్చయం'. ఒకరికొకరు సహకరించుకోవటంలో గొప్పతనాన్ని చెప్పే కథ 'నక్క భోజనశాల'. ప్రయత్నిస్తే ఫలితం దానంతట అదే వస్తుందని తెలియజేసే కధే 'బుజ్జి ఎలుగు ప్రయత్నం '. ఈ సంపుటిలో హాస్య కథలు కూడా ఉన్నాయి.'వేడుక ', 'మతిమరపు తాబేలు', అనుకరణ విద్య'ఈ కోవకు చెందిన కథలే.
'తాంబేలు ఇగురం'పేరులో తాబేలును తెలంగాణ ప్రాంతంలో 'తాంబేలు' అని 'ఇగురం ' అంటే తెలివి, ఉపాయం అని అర్థాలున్నాయి.. ఈ కథల సంపుటికి ప్రముఖ చిత్రకారులు తుంబలి శివాజీ రంగు రంగుల బొమ్మను ముఖచిత్రంగా అందించారు. ఇక లోపల ప్రతి కథకూ కూడా బొమ్మలు ఉన్నాయి. అవి కూడా ఒక పూర్తి పేజీకి బొమ్మ ఉండటం విశేషం. ఒక సినిమాకి సంగీతం ఎంత ఉపయోగపడుతుందో బాలల కథలకు బొమ్మలు అంతగా ప్రాధాన్యత కలిగిస్తాయి. పిల్లలు బొమ్మలు చూస్తూ కథ చదువుకుంటారు. ఈ కథల సంపుటి కోసం రచయితను సంప్రదించవచ్చు. ఆయన ఫోన్ నెంబర్ 92475 64699 కు సంప్రదించవచ్చు. ఈ సంపుటిలో 104 పేజీలు ఉన్నాయి. దీని వెల రూ.200 /-
సమీక్షకులు
మహంకాళి స్వాతి
89197 73272