సమీక్ష: తెలంగాణ వైతాళికుడు సురవరం మనవరం
సమీక్ష: తెలంగాణ వైతాళికుడు సురవరం మనవరం... book review of suravaram book
తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ పండుగల కోసం, తెలంగాణ సమాజం కోసం శ్రమించిన వారిలో చిరస్మరణీయులు సురవరం ప్రతాపరెడ్డి. నిజాం పాలనలో నలిగిపోతున్న భాషా సంస్కృతులకు దిశా నిర్దేశం చేసిన ప్రజ్ఞాశాలి. నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తన కలంతో మేల్కొల్పి జాగరూకం చేసిన తెలంగాణ వైతాళికుడు ఆయన.
సురవరం తన కలంతో నిజాం రాజుపైన నిప్పుల వర్షం కురిపించాడు. జోగిపేటలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా చేసిన ప్రసంగం మరపురానటువంటిది పాతికేళ్ళ వయసులో గోల్కొండ పత్రిక, సంపాదకుడుగా, ఎన్నో కథలు, వ్యాసాలు, సమీక్షలు, కవితలు మొదలైనవి ప్రచురించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల బాధలను, గోసను చెప్పడానికి గోల్కొండ పత్రికను ఆయుధంగా మలిచి, కృత కృత్యుడయ్యాడనటంలో సందేహం లేదు.
సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా 126 కవితలతో గోల్కొండ సాహితీ కళా సమితి ఆధ్వర్యంలో సురవరం_ మనవరం శతాధిక కవితా సంకలనం రావడం ఆయన సేవలను గుర్తు చేసుకోవడమే.
"ఉర్దూ రాజ్యమేలుతున్న సమయాన
నిరాయుధమైన తెలుగు భాషను
తన పత్రిక ద్వారా పరివ్యాప్తం చేసిన
సంపాదక సమరవృక్షం అతడే"
అంటూ డాక్టర్ నాళేశ్వరం శంకరం తెలుగు భాష పట్ల సురవరంకు ఉన్న ఇష్టాన్ని మా'నవతార' కవితలో వ్యక్తీకరించారు.
"సురవరం సాహితీ సరోవరం
చిరస్మరణీయమైన మన వరం"
అంటూ గంటా మనోహర్ రెడ్డి సురవరం కవితలో తన మనోగతాన్ని ఆవిష్కరించారు.
"స్థాంపించెను గోలకొండ
కవులకు అదే అండదండ
వెలుగులోకి రాని కవుల
మెడన వేసే పూలదండ"
అంటూ వెన్నెల సత్యం పాలమూరు సురవరం మణిపూసల్లో వర్ణించాడు.
"ఘన కీర్తి యున్నట్టి గద్వాల జిల్లాలో
ఇటిక్యాలపాడున నింపుగాను
సురవరమ్ము తెలంగాణ సురుచిరమ్ము"
అని యువ కవి గంగాపురం శ్రీనివాస్ సీస పద్యంలో వర్ణించారు.
"సాహితి పరిశోధకులుగా శోధన చేసి
గోల్కొండ కవుల సంచికతో లోకానికి చాటారు
రాజకీయాలలో అడుగిడిగి వాటి హుందాతనం పెంచారు"
అని మరో కవి సతీష్ 'బహుముఖ ప్రజ్ఞాశాలి లో వర్ణించాడు.
"గోల్కొండ కవుల సంచిక వల్లనే కదా
కవుల ఇళ్లకు ఇంత వెలుగు దొరికింది" అని ఒక కవి అభిప్రాయం.
"బహుభాషల స్నేహశీలిగా
రామాయణంలోని విశేషాలను తెలిపిన ఆధునిక వాల్మీకి"గా
సురవరం ప్రతాపరెడ్డిని మరొకరు వర్ణించారు.
"కొండెక్కిన భాషా సంస్కృతులకు
వెలుగు దివిటీలెత్తిన యుగపురుషుడు"
అని ప్రసిద్ధ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తన కవితలో అంటారు.
చైతన్యానికి మారుపేరు
సంస్కరణలకు మరో రూపు
అని తెలంగాణ తేజంలో డాక్టర్ బి. ఉమాదేవి అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది సురవరం 126వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని, అశేష సాహిత్య అభిమానుల కోరిక మేరకు తెలంగాణ సాహితి వైతాళికుడి సంస్మరణ కవితల తోరణాన్ని ఆవిష్కరించాలని గోల్కొండ కళా సమితి అధ్యక్షులు అర్థచంద్ర ప్రకాష్ రెడ్డి సంకల్పించడం అభినందనీయం. అంతేకాకుండా భారత రచనలో, నన్నయకు నారాయణ భట్టు తోడైనట్టు తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, లక్ష్య సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజ్ఞా రాజు, మనోహర్ రెడ్డి నిలబడటం నిజంగా అభినందనీయం. సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా 126 కవితలతో ఆ మహనీయుడికి నీరాజనాలు అందించాలన్న ఆలోచన గొప్పది. దీంట్లో ప్రతి కవిత ఆణిముత్యంగా చెప్పవచ్చు. కవితలన్నీ పుస్తక రూపంలో తీసుకొచ్చిన ప్రధాన సంపాదకులు డాక్టర్ చంద్రప్రకాశ్ రెడ్డికి, సంపాదకులు పడేసాబ్, గంటా మనోహర్ రెడ్డి, ప్రజ్ఞా రాజులకు శతధా సహస్ర అభివందనాలు.
పుస్తకం ముఖచిత్రం సురవరం గారి మహోన్నత చిత్రం తేజవంతంగా ఆకర్షణీయంగా ఉంది.
పుస్తకం వెల 150 రూపాయలు. పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య 137.
పుస్తకాన్ని ముద్రించింది లేపాక్షి ప్రింటర్స్ హైదరాబాద్
పుస్తక ప్రతులకు
తెలుగు భాషా చైతన్య సమితి
2_3_64 ఎ74
ప్రేమ్ నగర్ కాలనీ
అంబర్ పేట .హైదరాబాద్_13
9160607662
పుస్తక సమీక్షకులు
యాడవరం చంద్రకాంత్ గౌడ్
సిద్దిపేట
9441762105
Also Read...
అంతరంగం: సంఘ సంస్కరణల కథల శిల్పి రేగులపాటి కిషన్ రావు