ప్రకృతి ఎలుగెత్తిన కోపం

Antarangam

Update: 2024-09-09 01:15 GMT

ఈ నేల మీద ఎండలు, వానలు, చలిగాలులు, నీటి ప్రవాహాలు సహజాతి సహజం. ఇది స్వయంగా తనకు తాను ఏర్పరచుకున్న ప్రకృతి. ఇదే భూమి మీద జంతువులు, పక్షులు, క్రిమికీటకాలు సహజంగానే పుట్టి పెరుగుతుంటాయి. కానీ జంతువుల జాతిలోని ఒక్క మానవుడే ప్రకృతి సమతుల్యతను సర్వ నాశనం చేస్తాడు. ఈ సృష్టిలోని ఈ జీవికి ఇంత ఆపేక్ష లేదు. జంతువులు సహజంగా పుడతాయి చస్తాయి. కానీ దుర్మార్గంగా మనిషి మాత్రమే భూమిని, నదులను, చెరువులను, కుంటలను మేఘాలను ఆకాశాన్ని గాలిని నీటిని విధ్వంసం చేస్తాడు. సాటి మనుషులను చంపుతాడు, మోసం చేస్తాడు, అత్యాచారం చేస్తాడు. అన్ని దుర్మార్గాలకు మూలం మనిషి మాత్రమే. ప్రకృతిని చెరపట్టి సహజాతి సహజమైన ప్రవాహాలను మళ్లించి వికృతం చేస్తున్నాడు.

వెళ్లేటప్పుడు ఏం తీసుకుపోతాడో.. కానీ

మొన్న వయనాడ్‌లో, నిన్న విజయవాడ, ఖమ్మంలో ప్రకృతి చెలగాటమాడిన ప్రమాదాలే ఇవన్నీ. ఈ భూమి మీద కొన్ని సంవత్సరాలు జీవించి మరణించేందుకు వచ్చిన మానవుడు వెళ్లేటప్పుడు ఏం తీసుకుపోతాడో.. కానీ ఇక్కడి సహజ వ్యవస్థలను నాశనం చేస్తున్నాడు. సంపద కోసం పచ్చని అడవులు నరుకుతున్నాడు. అడవి ప్రాణులను హరిస్తున్నాడు. వేల సంవత్సరాల కింద ఏర్పడ్డ కొండలను గుట్టలను కైమా కైమా కొట్టి విదేశాలకు అమ్ముతున్నాడు. ఊరుకు గుట్ట ఒక కొండ గుర్తు. ఆ గుట్టలన్నీ ఇప్పుడు లేకుండా అవుతున్నాయి. ఇలా పైకి కనిపించే గుట్టనే కాదు. తిరిగి లోపల అంత దూరం తవ్వి తవ్వి గ్రైనేట్‌లుగా చీల్చి ఓడల ద్వారా విదేశాలకు అమ్ముతున్నాడు. ఆ గుట్టల మధ్య జీవించిన కోతులు కొండెంగలు సకల జీవరాశులు పక్కనున్న గ్రామాలకు, నగరాలకు వచ్చి మనుషులను పీక్క తింటున్నాయి. వ్యవసాయ పంటలను నాశనం చేస్తున్నాయి. గుట్టలు అమ్ముకున్న సర్కారు ఏం ముల్లె కట్టుకున్నదో గాని అవి గుత్త పట్టినోళ్లు గుట్ట అంత పైసలు సంపాదించుకున్నారు. ప్రకృతి విధ్వంసం మాత్రం తదనంతర కాలంలో ప్రజలు అనుభవిస్తున్నారు. అడవులు ఇలానే అక్రమ కలప దొంగ కలప అమ్మడంతోనే నాశనమవుతున్నాయి. అటవీ సంపద పోయిన తర్వాత అడవిలో జీవించే ఆదివాసీల పరిస్థితి మరింత అధ్వానంగా తయారయింది.

ప్రకృతిని కాపాడాలంటే..

గుట్టలు, అడవులు ఇలా ఉంటే నగరంలో చెరువులను చెరపట్టే పలుకుబడి కలిగిన దొంగలెందరినో ఇటీవల చూస్తూనే ఉన్నాం. దక్కన్ పీఠభూమిలో గొలుసు కట్టు చెరువుల నిర్మాణం సహజంగానే ఉంది. ఒక చెరువు నుంచి అలుగు దునికిన నీళ్లు మరొక చెరువులోకి ప్రవహించడం కాకతీయ కాలం నుంచి నిర్మాణంలో ఉంది. దుర్మార్గుడైన మనిషి డబ్బు దర్పంతో ఆక్రమించుకోవడం అమ్ముకోవడం ఒక విషాదం. చెరువు ఎక్కడైనా ప్రజలదే. కండబలంతో దాన్ని ఆక్రమించి గోడపెట్టి ఇంటి మీద ఇల్లు కట్టితే అక్కడ పడే వర్షం నీళ్లు ఎక్కడికి పోవాలి. ఆకాశం నుంచి కురిసిన వర్షం నేల మీద పడవలసిందే. భూమిలో ఇంకవలసిందే. కానీ ఆ భూమి అంతా సిమెంట్ కాంక్రీట్‌తో కప్పివేసింది కదా. మరి ఎక్కడికి పోవాలి పల్లం వైపే పోవాలి. ఇలా పోయే నీళ్ల దారి వైపే ఒకప్పుడు చెరువు ఉండేది. ఇప్పుడు ఆ చెరువులో నిర్మాణాలైనాయి. దీంతో ఆ నీళ్లు ఆ ఇళ్లల్లోకి పోతాయి. రోడ్లన్నీ నదులైపోతున్నాయి. మహానగరంలో ఒకసారి వర్షం పడితే ఇంటికి చేరడం బహు కష్టం. నీటిదారిలో కట్టడాలు ఉంటే నీళ్లు రహదారిలోకి వస్తాయి. ఖమ్మంలోనైనా, బెజవాడ‌లోనైనా నీళ్లను నీళ్లచోటే ఉండనివ్వాలి. లేకుంటే ఉవ్వెత్తున లేస్తాయి. ప్రకోపిస్తాయి. ప్రళయం సృష్టిస్తాయి. గాలిని కాలుష్యం, నీటిని కాలుష్యం చేస్తూ సహజానికి అసహజం అద్దుతున్నారు. మనిషి చుట్టూ పైసల వలయం అల్లుతున్నారు. ఆలోచనలనూ కాట కలుపుతున్నారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడాలంటే గుట్టలు, చెట్లు, అడవులు, నదులు, చెరువులు, కుంటలు వాటిని సహజ రీతిలోనే రక్షించాలి. లేకుంటే నిన్న మొన్నటి విధ్వంసమే ప్రకృతి ఎలుగెత్తిన కోపం.

- అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News

అమరత్వంపై