చెప్పింది చేయడానికి మీరే కావాలా?

Antarangam

Update: 2024-04-01 00:30 GMT

చట్టాలు అమలు చేసే యంత్రాంగం తంత్రాల తోనే వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్లకు అనుకూలంగా పనులు చేయమంటే ఎట్లా చేస్తారు. ఏ ఆదేశం అమలు చేయాలన్నా దానికో నిబంధన, పద్ధతి, రాజ్యాంగం చట్టం ఉత్తర్వులు ఉండే ఉంటాయి. ఈఈ నిబంధనలు అనుసరిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. అయితే అందరి ఫోన్లూ ట్యాపింగ్ చేయడం కుదరదని చెప్పొచ్చు.. కానీ వాళ్లే లొంగిపోతారు.

ఈ ఖచ్చితత్వం ఎందుకు లేదు?

మౌఖిక ఆదేశాలు ఇచ్చేది వాళ్ళు. ఖచ్చితంగా ప్రభుభక్తితో అమలు చేసేది వీళ్లు. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు అధికారుల వద్దనే ఈ లొంగుబాటు ఉంటది. చెప్పింది చేసుడు తలకాయ ఊపుడు ఇందులో తమ ప్రయోజనాలు ఉంటాయి. కానీ తదనంతరం పరిణామాలు ఊహించి ఉండరా అన్పిస్తది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్‌లో ఒక ఐఏఎస్ ఇరుక్కుపోయింది. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ సందర్భంలో A1 నిందితుడిగా నమోదు అయిన వ్యక్తి తెలిపినట్లుగా అప్పుడు ఆ ప్రభుత్వం చెప్పినట్లు మేం చేసినం ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పినట్లు మీరు చేస్తరు, మనం మనం పోలీసులం అనే అభిప్రాయం బయటకు వచ్చింది.

నిజానికి పోలీసులైనా, ప్రభుత్వ యంత్రాంగం ఎవరైనా చెప్పింది చేసుడేనా? కుదరదు... ఈ నిబంధన ప్రకారం కాదు అని ఖచ్చితంగా చెప్పితే ఏం చేస్తారు? ఎక్కువలో ఎక్కువ బదిలీ చేస్తారు. కానీ ఈ ఖచ్చితత్వం లేకపోవడం దిగజారుడుతనం. ఇది గత పదేండ్లలో విస్తృతంగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలోనూ ఇంజనీరింగ్ విద్య చదువుకొన్న నిపుణులతో నిర్మించాలి గానీ ఎక్కడ కట్టమంటే అక్కడ ఎట్లా కట్టమంటే అట్ల కట్టడమేనా? అట్లా నిర్మాణం చేయడం వల్ల ఇట్లా కుంగిపోయింది.

కుదరదని ఎందరు చెబుతున్నారు..

చెప్పింది చెయ్యడమే తప్పనట్లయితే, వాళ్లు ఇన్నేసి చదువులు ఇన్నేసి పరీక్షలు రాసి అఖిల భారత స్థాయిలో శిక్షణ పొంది ప్రజలందరూ గౌరవించుకునే ఉన్నత ఉద్యోగాలు చేయడం ఎందుకు అనే భావన వస్తుంది. పూర్వం భూస్వాముల వద్ద ఏ పనినైనా చేసే వాళ్ల లెక్క నడిస్తే దేశం ఏమైపోవాలి, విలువలు ఏమైపోవాలి? ముందు తరాల ఉద్యోగులకు ఏ ఆదర్శాలు పరంపరగా ఇస్తున్నం అనేది ముఖ్యం కదా. ఈ చెప్పింది చేసుడు ఆఖరుకు మరొక చెప్పేటోళ్లు వచ్చిన తర్వాత, పాతవి అవే చట్టాల ప్రకారం తవ్వి తీస్తే ఎట్లా ఉంటది?

రాజ్యాంగ మౌలిక సూత్రాలు, పౌర హక్కులు అన్నీ పకడ్బందీగా ఉంటాయి. ఏ చట్టం చేసినా ఏ ఉత్తర్వు ఇచ్చినా పై వాటికి అనుగుణంగానే ఉండాలి తప్ప వ్యతిరేకంగా ఉండకూడదు. కానీ అన్యాయం, అక్రమం, అవినీతి బరాబరి నడుస్తుంది. అడ్డులేకుండానే అమలు అవుతున్నది. దీనికంతటికి అధికారంలో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధుల ఒత్తిడే కావచ్చు కానీ, ఉత్తర్వులు జారీ చేసేవారు అన్నింటిలో సంతకాలు చేసేవారు మాత్రం అధికారులు మాత్రమే. మంత్రుల స్థాయిలో నోట్స్ ఫైల్స్‌పై సంతకాలు చేస్తారు దాన్ని సైతం పలానా నిబంధన ప్రకారం కుదరదనీ రాయొచ్చు. కానీ ఎందరు ఇట్లా చేస్తున్నారు?

మార్పిడి మంచిదే అనిపిస్తుంది.

దేశంలో గొప్ప గొప్ప అధికార యంత్రాంగం పనిచేసిన కాలమూ ఉన్నది. పతనం వైపు నడుస్తున్న తీరు చూస్తే పౌర సమాజం ఆందోళన చెందుతోంది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు భూముల దురాక్రమణ చేస్తారు, పేదవాళ్లవి కబ్జా చేస్తారు ఎవ్వరూ పట్టించుకోరు అయితే దానికి చట్టాలు ఉంటాయి. కేసులు పెట్టవచ్చు, కోర్టులకు ఈడ్చవచ్చు కానీ అధికారంలో ఉన్నందున ఆ చట్టాలు అప్పుడు పనిచేయవు. బాధితులు నెత్తీనోరూ కొట్టుకుని ఆందోళన చెందుతారు. మళ్ళీ అధికారం మార్పిడి జరిగిన తర్వాత ఆ ప్రతినిధులకు కోరలు ఊడిపోయిన తర్వాత అనే చట్టాలు యాక్టివేట్ అవుతాయి. అప్పుడు అరెస్ట్‌లు అవుతారు. ఒకే చట్టం అమలు చేసే కాలం వేరు అమలు చేసే యంత్రాంగంలో మార్పు... ఒకసారి నిర్వీర్యం, మరోసారి చర్యలు కాబట్టి అధికార మార్పిడి సమాజానికి ఎంతో మంచిదనిపిస్తుంది.

- అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News