మారేడుమిల్లి అడవుల్లోని ‘గుడిస’ ఎత్తైన కొండ ప్రాంతం. దీనిని గడ్డి మైదానం అంటారు. ఒకప్పటి తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఒక మండల కేంద్రం. గిరిజన ప్రాంతం. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో పుల్లంగి గ్రామ పరిధిలోనిది ‘గుడిస’. ఇక్కడికి ఉదయం ఐదు గంటలకు చేరితే అదొక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసు గాల్లో తేలిపోయి ఆనందం కల్గుతది. చుట్టూ రంగు రంగుల పర్పుల్ కలర్ పూల చెట్లు, రంగు రంగుల రాళ్ళు, ఎత్తైన మట్టికొండ మీద నిలబడితే మన తలకాయలను తాకుతూ వెళ్ళే మేఘాలు కన్పిస్తాయి. ఇక్కడ ఉదయం సూర్యోదయాన్ని చూడటం అనిర్వచనీయమైన ఆనందం. ఈ ప్రాంతం అంతా లోయలు లోయలుగా ఉంటుంది. ఒక పర్వతం అంచుల పైకి ఎక్కి చూస్తుంటే కింది నుంచి కదిలే మేఘాలు ఒకవైపు తెల్లని పొగమంచు మరోవైపు కన్పించి మనమూ తేలినట్టు అనుభూతి కల్గుతది. సూర్యోదయం కోసం ఎదురుచూస్తూ వందలమంది యాత్రికులు సెల్‌ఫోన్ కెమెరాలతో నిలబడుతారు.
ఒక్కసారిగా లేత బంగారు ఎరుపు వర్ణంలో సూర్యుడు పైకి లేస్తాడు. మేఘాల్లో దాక్కుని కొంచెం కొంచెం పైకి నవ్వుతూ కన్పిస్తాడు. పైకి కన్పించిన కొద్దీ కరిగిస్తున్న బంగారు ఎర్ర రంగులా విప్పారుతాడు. ఆ సూర్యోదయం చూడటంతోనే మనసు నిండిపోతది. దానికోసం మారేడ్‌మిల్లి నుంచి ప్రత్యేక జీప్ వాహనం తీసికొని ఎత్తు పల్లాలు గల రోడ్డు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం ఒక అనుభూతి. నడుం నొప్పులు, వృద్ధులకు కష్టం గానీ మామూలుగా వెళ్ళవచ్చు. లేదా ఆ ప్రాంతానికి ముందురోజు వెళ్ళి టెంట్ హట్ కిరాయికి తీసుకొని అడవిలో గడపవచ్చు కానీ ఇదంత శ్రేయస్కరం కాదు. ఈ ప్రాంతం ఒక రిజర్వ్ ఫారెస్ట్. రంగురంగుల సీతాకోక చిలుకలు ఎక్కడా చూడనివి కన్పిస్తాయి. వెళ్ళేటప్పుడు ఉదయం 4 గంటలకు చీకట్లోనే పోవచ్చు. ఆ ప్రాంతం వాతావరణం సన సన్నగా వణికించే శీతల గాలుల మధ్య ప్రయాణం కూడా గమ్మతైన అనుభూతి. మారేడుమిల్లి నుంచి గుడిస వరకు అరణ్యంలో అక్కడక్కడ గిరిజన గుడాలు ఉంటాయి. పోడు వ్యవసాయం చేసుకుంటారు. జీడి మామిడి చెట్లు, సింధూరం పూల చెట్లు, పనస చెట్లు అధికంగా కన్పిస్తాయి. పూర్వకాలంలో ఆదివాసీల్లాగా కాకుండా అక్కడక్కడా అంగన్‌వాడి కేంద్రాలు, ప్రాథమిక పాఠశాల కేంద్రాలు కన్పించాయి. ఊర్లలో చదువుకుంటున్న యువతీ యువకులు కన్పించారు. బస్సులు చాలా తక్కువ. ఆటోలు అసలే కన్పించవు. రకరకాల పక్షుల కిలాకిలా రాగాలతో ఆ ప్రాంతం అంతా మనోహరంగానే ఉంది.
టూరిస్ట్‌లతోనే ఇబ్బంది
గుడిస హిల్ స్టేషన్‌కు వచ్చే యాత్రికుల వల్లనే అక్కడి అడవి పర్యావరణం పాడైపోతోంది. పచ్చని చెట్ల మధ్య ప్లాస్టిక్ కాగితాలు, తాగిన సీసాలు, మంచి నీళ్ళ బాటిల్స్ కన్పిస్తున్నాయి. అంత తెల్లవారుజామున కూడా అక్కడికి పోయి ప్రకృతిని చూడకుండా సీసాలు పట్టుకుని పోయే అనాగరికులు ఎక్కువే ఉన్నారు. పర్యావరణం చెడిపోతుందని అడవీ శాఖ కొన్ని రోజులు అక్కడి వెళ్ళేందుకు నిషేధం విధించింది. కానీ అక్కడ వ్యాపారాలు చేసేవాళ్ల ఒత్తిడి వల్ల మళ్ళీ తెరిపించారు. ఆ కొండల మధ్య వెళ్ళేందుకు పెద్ద పెద్ద మోటర్ సైకిల్స్ మీద యువతీ యువకులు కూడా వస్తున్నారు. పర్యావరణాన్ని ప్రేమిస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ సూర్యోదయాన్ని పచ్చని అరణ్యాన్ని చూస్తే మంచిదే. ఇటీవల సంక్రాంతి సెలవులోనే మేము ఇద్దరం సాహిత్య మిత్రులు బూర్ల వెంకటేశ్వర్లు, పి సంపత్ యాదవ్ దంపతులం మారేడుమిల్లి, అరకు, విశాఖ, పర్యావరణ యాత్ర చేపట్టినం. పచ్చని అరణ్యంలో శీతల గాలులు.. గడ్డి మైదానం నుంచి మనముందు నుంచే తాకుతూ వెళుతున్న మేఘాలు. ఆ మబ్బుల నుంచి ఎర్రని సూర్యుడు గొప్ప అనుభూతి.
అన్నవరం దేవేందర్
94407 63479