మొదలైన ఎన్నికల రణరంగం..ఉత్త మాటలు షురూ!

antarangam

Update: 2023-10-16 00:30 GMT

ప్రజలకు సేవ చేయడానికి గింత పెట్టుబడి ఎట్ల పెడుతున్నవు గిన్ని కోట్ల పైసలు ఎట్ల ఖర్చు చేస్తున్నావు. అరె గిన్ని కార్లు, గిన్ని ఫ్లెక్సీలు, గింతమంది కార్యకర్తలను వెంటపెట్టుకుని లక్షలు కాదు కోట్లల్ల ఎట్ల ఖర్చు చేస్తున్నవు? అంతకుముందు నువ్వు ఎట్ల ఉంటివి, నీకున్న ఆదాయం ఎంత ఆమ్దానీ ఎంత? ఇవన్నీ ఎట్ల సంపాదిస్తన్నవు? మల్ల ఇదంతా ప్రజాసేవ అంటవు. ఇప్పుడు ఎలక్షన్ టైం వచ్చిందంటే ఇంటింటికి తిరుగుతావు, వాడ వాడ తిరుగుతవు. గదవ పట్టుకుంటవు. ఓట్లు కావాలని ఎన్నో చేస్తవు. ఎన్నికలు అయినంక సుతా గిట్లనే ఉంటవా? మల్ల ఎక్కన్నో ఉంటవు దొరకనే దొరకవు. అయినా అన్ని జూటా మాటలే మాట్లాడుతవు. అన్ని అబద్ధాలు చెప్పుతవు. నీవు చెప్పేది నా పార్టీ నాయకుడు చెప్పేది వేరే వేరే ఉంటయి. ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు. ఎవలకో కొందరికి ఎక్కన్నో దొరుకుతయి. అంత మోసం పైరవీలు అవినీతి, అన్యాయం, అధర్మం మీద నడుస్తది.

నిండినోందే నిండుతంది..

రైతు బతికే దినం కాదు సామాన్యుడు బతికేటట్టు లేదు. ఎక్కడ చూసినా మందు దుకాణాలు పెట్టిండ్రు. ఇప్పుడు ఎన్నికలంటే మందు తాగియాలె, ఓట్లు వేయించుకోవాలె, పైసలు కుమ్మరిస్తుండ్రు. ఎన్ని కోట్లు, ఎన్నెన్ని కోట్లు కూడా పెట్టిండ్రు ఎట్ల సంపాదించిండ్రు ఇప్పుడైతే తేనె పూసిన మాటలు మాట్లాడుతరు. ఊర్లర్ల ఓట్లు దొబ్బుకపోయేందుకు కులాలను పోగు చేస్తరు. కుల సంఘ నాయకులను పట్టుకుంటరు. వాల్లను మత్వరిచ్చి గంపగుత్తగా ఓట్లు కొల్ల గొడుతరు.

మరి ఊర్లల్ల గుట్టలు మాయం అయితున్నయి. గుట్టలు, కొండలు విదేశాలకు అమ్ముకుంటున్నరు. నదులల్ల ఇసుక సుత అమ్ముకుంటున్నరు. సహజ వనరులన్నీ వట్టి పోతున్నయి. ఏ పెద్ద పెద్ద వ్యాపారాలు, కాంట్రాక్టర్లు చూసినా రాజకీయ నాయకులవే ఉంటున్నయి. భూముల ధరలు పెరుగుతున్నయి. పంటలు పండే భూమి తగ్గిపోతుంది. అంత రియల్ ఎస్టేట్ మాయ అయితంది. ఎక్కడ చూసినా అమ్మకాలు కొనుగోల్లు పేదవాళ్లకు అమ్ముకునేందుకు ఏం లేదు. అసలు రెండు గుంటలు కొనుక్కుని ఇల్లు కట్టుకుందాం అంటే పల్లెటూర్లల సుత జాగలు పరిం అయినయి. నిండినోందే నిండుతంది. ఎండినోంది ఎండుతుంది.

ఎవలను చూడు అవే లెక్కలు..

మనిషికి లేని చెడ్డ అలవాట్లు లేవు. పూరా ఆలోచనలు చేయ్యకుండ టీవీలు, ఫోన్‌లల్లనే పాటలు ఇంటర్‌నెట్‌లు, గేమ్‌లు అసలు ఇది మంచిగా లేదు సర్కారు చెడ్డ పనిచేస్తుంది అని ఆలోచించే తీరిక లేకుండా పోయింది. మంచి చెడు ఎంచే తీరిక కూడా కోల్పోయే కాలం దాపురించింది. ఏమైనా చెవుల డోరిగాలాగా వాడు చెప్పిందే వినుడు. ఆఖరు ఓట్లు అమ్ముకునే దాకా వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే రానురాను మంచిగా ఉండాలే గని ఓటర్లను సుత అవినీతి పరులను చేస్తిరి గద.

ఓట్ల కోసం పైసలు ఇచ్చుడు, తర్వాత పైసలు కమాయించుడు అవినీతి, అధర్మం, అనేవి ఉత్త మాటలు లెక్క అయిపోయినవి. ఎన్నికల రణరంగం మోపైంది. ఎవలను చూడు గీ పార్టీ గెలుస్తదా, గా పార్టీ గెలుస్తదా అనే లెక్కలే! ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్సిన కాలం కోసం ఎదిరిచూడాలె!

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News