ఎంత విద్వేషం తలకెక్కితే.. అలా ఊరేగించారు?

Antarangam

Update: 2023-07-30 19:30 GMT

డవాళ్లను అలా నగ్నంగా ఊరేగించారంటే.. ఎంత పొగరు నిండిన మనుషుల గుంపు అయితే అలా హింసానందం పొందుతుంది? వాల్ల తలలో ఎంత విద్వేషం నిండిపోయి ఉంది? ఆ దృశ్యాలను కనీసం చూస్తే కూడా అయ్యో ఎంత అన్యాయం ఎంత అమానుషం అన్పిస్తుంది. మహిళలై పుట్టినందుకు ఏం తప్పు చేసిందని ఇంతటి శిక్ష అనుభవిస్తున్నారని కలత చెందుతాం. కానీ ఆ నగ్న ఊరేగింపు దృశ్యం వెనుక నడుస్తున్న గుంపు.. ఆ తర్వాత అత్యాచారం.. ఇలా ఎంత మంది ఎన్ని రోజుల నుండి నడుస్తున్నది? ఈ హననం చూసేవాళ్లకే గుండె పగిలిపోతుంది. ఇది చేసేవాళ్లకు అసలు హృదయం ఉందా? ఉంటే అందులో ఎంత ద్వేషం, ఎంత పగ, ఎంత ప్రతీకారం నిండిందో కదా! ఎవరు నింపారు అంతటి ఉన్మాదం.

వారిలో భయం లేదా!

ఆ స్త్రీలు గానీ, వాళ్ల జాతి గానీ, వాళ్ల సంస్కృతి గానీ, సంప్రదాయం గానీ, వాళ్ల వారసత్వం గానీ ఏం అన్యాయం చేసిండ్రు, ఎవరిని ఎదిరించిండ్రు? ఎవరిని వ్యతిరేకించిండ్రు? బలహీనులనా? అల్ప సంఖ్యాకులనా? అల్ప మతస్తులనా? నచ్చని సంప్రదాయాలనా? ఎందుకీ జాతికి జాతితో సమస్త వైరం పెట్టుకోవడం? అందరి సృష్టి భగవంతుడేనని అందరూ అనుకుంటారు గదా! ఎవరి భగవంతుడైనా ఒక్కడే కావచ్చు గదా! వేరు వేరైన మాత్రాన మహిళలపై ఇంత దౌర్జన్యం ఎలా చేస్తారు? ఏ అండతో చేస్తారు? ఏ పవర్ వెనుక ఉంటే చేస్తారు? రాజ్యాంగం, చట్టాలు, న్యాయస్థానాలు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ప్రభుత్వ యంత్రాంగం దేని వల్ల జంకు లేదా? భయం లేదా? పాప భీతి లేదా? అత్యాచారాలు, హత్యలు, దహనాలు, ఎందుకు సాదా సీదాగా చిన్న నేరంగా సులువుగా చేస్తున్నారు? అంటే వారిలో భయం లేదా? అసలు ఏ కారణంతో అంత దారుణం చేస్తున్నారు.

జంతువు కన్నా..దారుణంగా మనిషి!

ఆ జాతికి వ్యతిరేకంగా ఎంత విద్వేషం నింపినా.. ఎవరి ప్రయోజనాలు ఎన్ని ఉన్నా వాళ్లు ఇంత క్రూరత్వం వైపుకు ఎట్లా వెళుతున్నారు. మృగాలు కూడా తమపైకి దాడి చేసి చంపడానికి వస్తేనే తిరిగి చంపుతాయి. అంతేకానీ.. లేకపోతే వాటి మానాన అవి వెళ్ళిపోతాయి! లేదా ఆహారం అవసరమై చంపుకొని తింటాయి. కానీ మనిషెందుకు మనిషిని చంపుతున్నాడు? మనిషి ఎందుకు అత్యాచారాలు చేస్తున్నాడు? మనిషి ఎందుకు దోపిడీ చేస్తున్నాడు? పైగా మనిషి అన్ని జంతు జాలాలకన్నా నాగరికత తెలుసుకున్నవాడు నాగరిక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. శాస్త్ర సాంకేతిక రంగంలో అగ్రగామి. తమ జీవన సౌలభ్యం కోసం చట్టాలు నిబంధనలు తయారు చేసికున్నవాడు. అయినా క్రూర మృగాల కంటే దారుణంగా మనిషి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఈ ఒక్క నగ్న ఊరేగింపే కాదు ఎక్కడ చూసిన మనుషుల పట్ల మనుషుల్లో క్రూర స్వభావం పెరిగి పోతుంది. భూత, దయ, కరుణ, జాలి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఇంత అన్యాయం చేస్తున్నా, తర్వాత నాకేమైనా అయితదా? అనే భయం కూడా లేదు. ఎందుకంటే ఇదంతా వ్యూహాత్మకంగా సాగిస్తున్న దారుణం. ప్రపంచం నివ్వెరపోయే తనం.

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News