అంతరంగం: మానసిక ఒత్తిడితోనే ప్రశాంతత కరువు

antarangam

Update: 2023-02-26 19:30 GMT

నిదానం నెమ్మదితనం ప్రశాంతత లేని తరం కనబడుతుంది. ఎక్కడ చూసినా ఉరుకులాట ఎక్కువైంది వేగిరం ఎక్కువైంది. జీవితం పరుగుపందెం లెక్క తయారైంది. కొందరు తయారు చేసికుంటున్నరు. కొన్ని వృత్తులు అట్లనే ఉంటన్నయి. ఒత్తిడి మీదికెల్లి టార్గెట్లు తొందర పెట్టుడు ఎక్కువ పనిచేసుడు తక్కువ చేసింది మీదికి రిపోర్ట్ చేసుడు ఎక్కువ. ఈ మానసిక ఒత్తిడితోనే ప్రశాంతత అందరిలో కరువైంది. అయితే ఏ ఒత్తిడి ఏ పనీ పాట లేని వాల్లు కూడా ప్రశాంతంగా లేరు. నిదానమైన ఆలోచన పనిమాట ముచ్చట ఏదీ కనపడని తరం ఎక్కువగా కనిపిస్తుంది.

ఇంకెక్కడి ప్రశాంతత

మనిషి ఎట్లా తయారైతండంటే చదువు చదువు, మార్కులు మార్కులు మెరిట్‌లు ఆ తర్వాత ఉద్యోగాలు ప్యాకేజీలు అన్ని దశల్లోనూ గడియారం ముల్లుతోనే పోటీపడటం, ఎప్పుడు ముల్లు వేగానికి వెనుకబడటమే ఉంటది. అందుకే ఒత్తిడి నిద్రలేనితనం నిద్రరాని రాత్రులు వీటికి తోడు కండ్ల నిండా సెల్‌ఫోన్‌ల నుంచి వచ్చే తెల్లని కాంతి కంప్యూటర్ నుంచి వచ్చే కాంతి మెడలు సాగదీసి సూసుడు లేదా మెడను చాలాసేపు వంచి సూసుడు, కుడి చెయ్యి లేదా ఎడమ చెయ్యి ఎత్తి ఎంతసేపో తెల్వకుండా ఏర్పడకుంట పట్టించుడు, వేలుతోనే ప్యాడ్ మీద పైకి కిందకి ఆడిచ్చుడు. కండ్లల్లకెల్లి నీళ్ళు కారేదాకా యూట్యూబ్ గెలుకుడు, గేమ్లు ఆడుడు, కండ్ల డాక్టర్ల సుట్టు తిరుగుడు. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి పోవుడు వాల్లు దొరికిందే బుక్క అని ఉన్నయి లేనియి రాసుడు, మాత్రలు, ఫిజియోథెరపీ పొందుడు తగ్గినట్టే తగ్గినంక సైడ్ ఎఫెక్ట్‌లు... ఇట్లా నడుస్తున్న కాలానికి నిదానమెక్కడ నిగురానుగ కుటుంబంతోని కూసోని మాట్లాడుడెక్కడ ఇంకెక్కడి ప్రశాంత వదనం. రానూ రానూ ముఖం మీద చిరునవ్వు మాయం అవుతుందా అన్నట్టు ఉన్నది ఫొటోలు తీసేప్పుడు స్మైల్ ప్లీజ్ అన్నప్పుడు బల్మీటికి నవ్వుడు తప్పితే సహజంగా మనిషిని చూస్తే మనిషికి నవ్వులు రాని కాలం వస్తుంది.

ఇంత ఉరుకులాట ఎందుకు

రోడ్ మీద పోతుంటే కొందరి బండ్ల స్పీడ్ 60, 70ల కట్టుకుంట వెళ్ళుతుంటయి. ఎక్కడ స్లిప్ అయినా ఆయనకు ఎదురుగా నెమ్మదిగా వచ్చే అమాయకులకైనా కష్టకాలమే. అంత తొందరగా వెళ్ళి ఏం చేస్తారో అర్థం కాదు. ఎక్కడ చూసినా తొందర స్పీడ్ అన్నట్లా కన్పిస్తుంది. ఇంట్లో తమ పనులు తాము చేసికునేటప్పుడైనా నిదానం లేదు. ఒక పద్ధతి లేదు. కొందరిని చూస్తే స్నానం కూడా నిదానంగా చెయ్యరు. బుడబుడ నీళ్ళు పోసుకుంటరు బయటకు వస్తరు. అన్నం కూడా కొంతసేపు నమిలి తినడం కన్పిస్తది. ఫంక్షన్‌లలో చూస్తే జప్ప జప్ప నమలకనే తినుడు ప్లేట్ అటు ఏసుడు చూస్తూనే ఉన్నం. కొందరి విషయం ఎప్పుడు ఆదర బాదర కన్పిస్తరు మాటలు పనులు అట్లనే ఉంటయి. అంతా స్పీడ్ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మానవ సంబంధాలు పరిపక్వగా ఉంటాయి. మనిషి నిరంతరం చలన శీలంగా ఉండాలి. చైతన్యంగా ఆలోచించాలి. కలివిడిగా ప్రశాంతంగా కన్పించాలి. అంతేగాని తరుముతున్న జీవితంగా ఉండకూడదు. వేగిరం తొందరపాట్లు ఒక్కోసారి మంటలు జారవిడుచుతయి. అనరాని మాటలు జారవచ్చు ఇంకొకరిని ఇబ్బంది పెట్టవచ్చు. కావున నిదానమే ప్రధానం. అంటే వేగిరపు పనులు వేగిరంగానే చెయ్యాలి. అందులోనూ నిదానంగా ఆలోచనలు ఉండాలి. అందుకు దృఢ దృష్టి, దృఢ సంకల్పం ఉండి తీరాలి.

అన్నవరం దేవేందర్

94407 63479

Tags:    

Similar News