కవిత్వానికి ఇంత ఫాలోయింగ్ ఇదివరకు చూడలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజీ ముందు బహిరంగ వేదిక మీద కవిత్వం గానం చేస్తుంటే, వేలాది మంది ఆ పంక్తులతో ఇన్‌వాల్వ్‌మెంట్ అయ్యారు. ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో తెలుగు లిటరసి కాంగ్రెస్ 2024 మహాసభలు మూడు రోజులు చారిత్రకంగా జరిగాయి. ఆచార్య గోపి ముఖ్య అతిథిగా ఆరంభమైన సభల్లో కవిత్వతత్వం, కథా సందర్భం, కవితా వసంతం, నవలా సమయం, విమర్శ దర్శనం, సాహిత్య శిల్పం, కవితా పొద్దు పరిశోధనా విపంచి వర్తమాన తెలుగు భాషా సాహిత్యాల గమనం, గమ్యం అంశాలపై ఆయా రంగాల నిపుణులలో చర్చలు జరిగాయి.
అక్కడ కవిత్వం చదువుతుంటే..
ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న 25 విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు, ఆసక్తిగల సాహిత్యకారులు పాల్గొన్నారు. ఆచార్య చింతకింది కాశీం కన్వీనర్‌గా, ఆచార్య సాగా కమలాకరశర్మ కో కన్వీనర్‌గా ఆచార్య చింతా గణేశ్ దర్శకత్వంలో గొప్పగా రూపొందించారు. ఇట్లాంటి సదస్సులు విశ్వవిద్యాలయాల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ రెండు పుటలు కవితా విపంచి కవితా పొద్దులో ఇరవై అయిదు మంది చదివిన కవిత్వం ఉస్మానియా మైదానంలో అగ్గి రవ్వలు కురిపించింది. చల్లని వసంతమై ఆవరించింది. అక్కడి నేల ఆకాశం కవితామయం అయ్యింది.
సినారె స్మృతిలో కవితా విపంచి పేర జరిగిన కవి సమ్మేళనంలో కవిత్వానికి, పాటలకు శ్రోతల్లోంచి కోరస్‌లు విపరీతంగా వచ్చాయి. ఈ రెండు వేదికల మీద పేరెన్నిక గల పాట కవులు అద్భుతంగా పాటలు పాడారు. తెలుగు నేల మీద పాట ఒక ఉప్పెన, ఓ ఉద్యమం. ఏ ఉద్యమాల్లోనైనా పాటదే పై చేయి. పాట తర్వాతనే సాహిత్యంలో కవిత్వం, కథ తదితరాలు. వేలాదిమంది ముందు వాగ్గేయకారుల పాటలకు సభ మొత్తం కోరస్ ఇస్తున్న విషయంలో కానీ అంతటికీ ఎరుకే.
కానీ ఆర్ట్స్ కాలేజీ ఆవరణ పైన చందమామ నక్షత్రాలు చల్లని పిల్లగాలి అద్భుతమైన దద్దరిల్లే డి.జె మైకులు ఎదురుగా వెయ్యి నుంచి రెండు వేల మంది జనాలు బహుశా వాళ్లంతా తెలుగు సాహిత్య విద్యార్థులు లేదా పరిశోధకులు సదస్సుకు వచ్చిన అధ్యాపకులు కావచ్చు. ఉర్దూ కవిత్వం చదువుతుంటే అక్కడి శ్రోతలు కూడా ఇన్‌వాల్వ్ అయి వహ్వా.. వహ్వా అంటూ ప్రతిధ్వనిస్తారు. ఈ సంప్రదాయం మళ్లీ ఆర్ట్స్ కాలేజీ ముందు తెలుగు కవిత్వానికి దక్కింది.
ఈ తరంలో కూడా..
అసలు కవి సమ్మేళనాలు సభలో యాభై అరవై మంది కవుల కంటే ఎక్కువ ఉండరు. కానీ ఇక్కడి సభలో వెయ్యి మందికి పైగా కన్పించారు. పన్నెండు మంది కవులు ఒకరోజు మరో రోజు పదముగ్గురు కవులను ఎంపిక చేశారు. ముఖ్య అతిధుల ప్రసంగాలు ఉంటాయి కానీ అవన్నీ కవితామయమై కవిత్వం సాగుతున్నట్టు ఉంటాయి. ఒక్కో కవి ఒకటీ రెండూ.. ఆ వాతావరణంలో ఉత్సాహంగా పరవశించి చదువుతారు. ఎందుకంటే ప్రేక్షకుల నుంచి కరతాళ ధ్వనులు.
సాధారణంగా కవిత్వం మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి విద్యావంతులు లోలోన చదివి ఆనందపడేది లేదా ఆలోచనలు చేసేది పాటనైతే ఎవరినైనా ఉర్రూతలాగిస్తది. దాని పవరే వేరు. బాగా ప్రసిద్ధికెక్కిన కవిత్వం శ్రీశ్రీ, శివసాగర్, అలిశెట్టి సాహిత్యేతరులకు కూడా తెలుసు. కానీ ఈ తరంలో కవిత్వాన్ని ఇంతలా వినడం ఒక గొప్ప సందర్భం.
ఈ సదస్సులో అన్ని వాదాలతో పాటు ప్రకృతి వ్యవసాయం పుర జ్ఞాపకాలు, సమకాలీన సమస్యలు, రాజ్యం, మతోన్మాదం, అణచివేత, పోరాటాల కవిత్వం విన్పించారు. అందుకే బహిరంగ సభలో జరిగిన సినారె, గద్దర్ స్మృతుల్లో కవితా విపంచి, కవితా పొద్దు కార్యక్రమాలు తెలుగు సాహిత్య చరిత్రలో రికార్డ్ చేయతగ్గవి.
- అన్నవరం దేవేందర్
94407 63479