తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ కాంక్షలో నిధులు, నీళ్లు, కొలువులతో పాటు సంస్కృతి, అస్తిత్వం మిళితమై ఉన్నాయి. భాష, సంస్కృతి జీవనశైలిలో మన తెలుగుల మధ్యనే వైరుధ్యాలు. మనది కాని కల్చర్‌లో ఇంకి పోతున్నామనే భావన ఉండేది. సరే, తెలంగాణ తెచ్చుకున్నాం. మన సంస్కృతికి గౌరవం కూడా వచ్చింది. కానీ, కొత్తగా ఉత్తర భారతదేశ సంస్కృతి విస్తృతమవుతోంది. ముఖ్యంగా గుజరాత్‌వాళ్ల వ్యాపారం మండలాల స్థాయికి చేరింది. రాజస్థాన్ హోటళ్లు, స్వీట్ హౌజ్‌లు కొంచెం పెద్ద ఊర్లళ్ల కూడా ఉన్నాయి.
గుజరాత్, రాజస్థాన్ మాత్రమే గాకుండా ఉత్తర ప్రాంతంలోని వ్యాపార వృత్తి గలవాళ్లంతా నిండి పోతున్నరు. ఇటీవల నల్లగొండ జిల్లాలో ఒక ఘటన జరిగింది. తమకంటే తక్కువ కూలి తీసుకుని బిహార్ కూలీలు తమ పొట్ట కొడుతున్నారంటూ మనవాళ్లు గొడవకు దిగారు. యజమానులు సహజంగా తక్కువ కూలి తీసుకునేవారినే పిలుస్తారు కదా! దీంతో ఇరువర్గాల మధ్య రాళ్లు రువ్వుకునే స్థితి వచ్చింది. దేశంలో పౌరులు ఎక్కడైనా నివసించవచ్చు. వ్యాపారం, వృత్తి ఏదైనా చేసుకోవచ్చు. చట్టపరంగా కరెక్టే కానీ, ఇక్కడి అదే వృత్తిదారులకు, వ్యాపారులకు ఇబ్బంది కలుగుతది. ఇది రానున్న రోజులలో తీవ్రతరం కావచ్చు.
ఇపుడు అంతటా వారే
ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పుడు వ్యవసాయ కూలీలు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ నుంచి బిహార్ నుంచి వచ్చి 'ఎకరానికి ఇంత' అని గుత్త పట్టి వరి నాట్లు వేస్తున్నరు. పత్తి, మిరప ఏరుతున్నరు. మనవాళ్ల కన్నా తక్కువకే చేస్తున్నరు. మన రైతులకు లాభమే కానీ, మన కూలీలకు నష్టం వస్తుంది. ఎన్నో యేండ్ల నుంచి ఇటుక బట్టి కార్మికులు బాండెంజ్ లేబర్‌గా వస్తున్నరు. వీళ్లకు ఒక దళారి ఉంటడు. ఇంత మందిని ఇన్ని రోజులకు అనే లెక్క ఉంటది. ఆయనకు కమిషన్ ఇస్తరు.
కప్ బోర్డ్ పనులు చేసే కార్పెంటర్‌లు కూడా చాలా మందే వస్తున్నరు. వీళ్లు ఎక్కువగా బెంగాల్ నుంచి వస్తరు. కలకత్తావాళ్లకు డెకరేషన్ పని ఎక్కువగా వస్తది. వినాయక మండపాలు నిలబెట్టింది కలకత్తా కార్మికులే. ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలే అంత నైపుణ్యం పనిలో చురుకుదనం మనవాళ్లలో కన్పించదు. ఇంటికి రంగులు వేసేవాళ్లు కూడా ఇతర రాష్ట్రాలవాళ్లే వస్తున్నరు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకున్నది ఇతర రాష్ట్రాల కూలీలే. ఇదంత అక్కడి కార్మికులపై ఎందుకు వస్తున్నారనే అక్కసు కాదుగానీ, మనవాళ్లు ఇట్లా చేస్తలేరనే తపన. కూలీలను పక్కనపెడితే గుజరాతీయుల వ్యాపారాలు మన సంప్రదాయ వ్యాపారులను పెద్ద దెబ్బ తీస్తున్నాయి.
సంప్రదాయాలకు విఘాతం
నిజానికి ఒక మోస్తరు పట్టణాలలో కూడా సూపర్ మార్కెట్లు వచ్చినయి డి-మార్ట్, వాల్ మార్ట్ మరికొన్ని వచ్చి మనవాళ్ల చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇంకా మిగిలింది ఏమంటే అన్ని జిల్లాలలో హోల్‌సేల్ వ్యాపారం గుజరాతీలదే. ప్లాస్టిక్ వస్తువులు, పేపర్లు, కిరాణా సామానులు మొదలుకొని అన్ని సరుకులను వీళ్లే హోల్‌సేల్‌గా ఇక్కడి చిరు వ్యాపారులకు అమ్ముతున్నరు. మన హోల్‌సేల్‌వాళ్ల కంటే వాళ్ల దగ్గర కొంత తక్కువ దొరుకుతుందనే ప్రచారం ఉన్నది. వీళ్లతోపాటు వాడవాడకు పానీపూరి బండ్లు, జిలేబీ బండ్లు ఫలూదా ఐస్ క్రీం బండ్లు, సమోసా తయారు చేసే బండ్లు, పాపుడాలు, ఆలూ కచోరిలు, రకరకాల తినే వస్తువులను వాడవాడకు పెట్టుతున్నరు. మనవాళ్లు ఆ చిరుతిండికి అలవాటు పడుతున్నరు. చాయ్ హోటళ్లు, స్వీటు షాపులైతే లెక్కనే లేదు. ఏ ఊరుకు వెళ్లినా మనది కాని తిండి అలవాటవుతోంది.
పానీపూరి, కట్‌లెట్ ఇట్లాంటివి ఎన్నో యూత్ ఆరగిస్తున్నారు. ఈ వ్యాపార సంస్కృతిలో మనదైన ఆహార సంస్కృతి పూర్తిగా కనుమరుగైంది. ఒకప్పుడు హోటల్ అంటే పూరి, మిర్చి బజ్జీలు ఉండేది ఇప్పుడు అవి కన్పిస్తలేవు. కొత్తవాటికి మనవాళ్లు సులువుగా ఆకట్టుకుంటున్నారు. మరి ఇతర ప్రాంత మార్కెట్‌లలో మన సర్వపిండి లాంటి వంటకాలు కన్పించవు. ఇతర ప్రాంతాలవాళ్లు కేవలం పని కోసమే వచ్చి రోజంతా అదే పనిలో ఉండి కష్టపడుతున్నారు. మనవాళ్లు స్థానికులు కాబట్టి సవాలక్ష పనులు ఉంటాయి. దీంతో వాళ్లకే ఎక్కువ గిరాకీ దొరుకుతుంది. హైదరాబాద్ మహానగరం కాబట్టి అన్ని రాష్ట్రాలవాళ్లు ఉంటరు అనుకుందాం. కానీ, జిల్లాలు మండలాల కేంద్రాలకు ఉత్తర భారతదేశానికి చెందిన అన్ని రకాల వ్యాపారులు చేరిపోతున్నారు. మన సంప్రదాయ వ్యవస్థ మీద మాల్స్ దెబ్బతీసాయంటే వీళ్లతో మరింత నష్టం చేకూరుతుంది. రానున్న రోజులలో ఇదొక సామాజిక సమస్యగా మారవచ్చు.
మన పాటకూ ఆటంకం
ఇప్పుడు మనం చూస్తున్నాం సంప్రదాయ బతుకమ్మ పాట మాయమైంది. దాని స్థానంలో ఉత్తరాది దాండియా చేరింది. ఈ ఐదారు సంవత్సరాలలో ఎక్కడ చూసినా దాండియా పాటలు, ఆటలు, బతుకమ్మ చుట్టూ కోలలు కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు. నిజానికి ప్రపంచంలో ప్రకృతి పూల నుంచి ఉన్న ఈ పండుగ మన తెలంగాణలో మినహా ఎక్కడా లేదు. మరి ఈ పండుగను ఉత్తరాదివాళ్లు ఎక్కడైనా మహిళలు 'పూల పండుగ కదా!' అని ఆడుతున్నారా! ఆడరు. అంతెందుకు మన తెలుగు నేల మీదనే ఆడనే ఆడరు. అంటే, ఎవరి సంస్కృతి సంప్రదాయాల పట్ల వాళ్లకు అంత నిబద్ధత ఉంటే మనకెందుకు లేదు? మనం ఎందుకు ఇతరులను అనుకరిస్తున్నాం? మన మనసు ఎందుకు భావదాస్యం వైపు మర్లుతుంది. సరే, అవి నచ్చుతే అవి ఆడుకొని, పాడుకొని బతుకమ్మ పాటలు పాడితే బాగుంటది కదా? స్థానిక సంస్కృతి, స్థానిక వ్యవహారం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
అన్నవరం దేవేందర్
94407 63479