మట్టి మనుషుల బతుకులపై కథలకు ఆహ్వానం

వడ్డెరలు - తరతరాలుగా అక్షరాలందని మట్టి మనుషులు. శ్రమతప్ప ఏమీ తెలియని వాళ్లు.

Update: 2024-09-18 14:33 GMT

డ్డెరలు - తరతరాలుగా అక్షరాలందని మట్టి మనుషులు. శ్రమతప్ప ఏమీ తెలియని వాళ్లు. ఉన్న ఊరినీ, కన్నవాళ్లనూ వదిలి, ఎక్కడ పనిదొరికితే అక్కడికి సాగిపోయే వలస పక్షులు. మండే ఎండల్లో చెమటా, నెత్తురూ ఆవిరవుతున్నా విశ్రమించని కష్టజీవులు. వాళ్ల చెమటతో తడవని నేల లేదు. వాళ్ల నెత్తురింకని భూమి లేదు.

చెరువులూ, కుంటలూ, కాల్వలూ, బావులూ తవ్వి ఈ లోకం దూపతీర్చిన ఊటసెలిమెలు వాళ్లు. గొలుసుకట్టు చెరువుల్లో మత్తడై దుంకిన దుఃఖం వాళ్లది.

కొండల్ని పగలేసి, బండల్ని పిండినవాళ్లు. భూగర్భంలోకి వెళ్లి తమ నెత్తుటి నరాల్లోంచి ఊటసెలిమెల్ని భూతలంపైకి విరజిమ్మే మనుషులు. స్వేచ్ఛకోసం పెనుగులాడుతూ, నెత్తుటేరుల్లోంచి నడిచి వచ్చి చరిత్ర నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు.

సొంతూరు ఏదీ లేనోళ్లు. ఎక్కడ పని దొరికితే అక్కడే వాళ్ల చిరునామా. పదేండ్ల పిల్లల నుంచీ పండు ముసలి వాళ్ల దాకా కొండలే దిక్కు. మట్టిపనే దిక్కు. ఏ బడీ వాళ్ళను దరిచేరనివ్వలేదు. ఏ గుడీ వాళ్ల నీడ సోకనివ్వలేదు.

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో వడ్డెరల జీవితం, సంస్కృతి గురించిన కథలే లేవు. తెలుగు సాహిత్యంలో ఎక్కడా వీళ్ళ ప్రస్తావన లేదు. సాహిత్యకారులు ఈ అట్టడుగు వర్గ ప్రజల జీవితాన్ని పట్టించుకోలేదు. వీళ్ళ బతుకుల్నిచూడ నిరాకరించారు.

వడ్డెరల బతుకుల్లో అలముకున్న చీకట్లను, విషాదాన్ని, విధ్వంసాన్ని, కల్లోలాన్ని చిత్రించిన కథల్ని ఆహ్వానిస్తున్నాం. మట్టి మనుషుల బతుకులపై మీరు రాసిన కథల్ని రెండు వారాల్లోగా మెయిల్ చేయండి.

E Mail : triballiterature0@gmail.com


Similar News