గాయానికి నువ్వే మందువి

Update: 2022-05-22 18:30 GMT

కాలం అప్పుడప్పుడు

కన్నీటి గాయాల మీదనుంచి

వేదనా బాధల మీదనుంచి

తడిఆరని తపనల మీదనుంచి.....నడిచెళుతూనేవుంది

పగిలిన అద్దాల్లాంటి రోజుల్ని ఏరుకుంటూ

విసిగిన క్షణాల్ని దోసిలిలో పట్టుకుంటూ

ఆవిరైపోయిన ఆశలపొగని బుడ్డీలో దాచుకుంటూ

ఎండిన ఎడారిలో ఒంటరై గమిస్తుంది...

ముసుగు కప్పుకుని

ఛీత్కారాలను ఛీదేసుకుంటూ....

వెన్నుపోటు పొడిచి

ఏమెరగనట్టు నంగి నంగి నడిచే కంత్రీగాళ్లకు దండేసుకొంటూ...

పులిసి కుళ్లుకంపు కొట్టే

కంపల్లాంటి మాటల వాసన మీంచీ

అప్పుడప్పుడూ బాధతో నడిచెళుతుంది...

పచ్చని అవనిని చుట్టుకున్న

ఆమె నవ్వును కాస్త బుగ్గలకి అద్దుకుంటూ

పసి నవ్వుల చిలిపి వానలో తడుస్తూ

విరబూసిన పూవుల మకరందాన్ని

ఒళ్లంతా పులుముకుంటూ

అప్పుడప్పుడు సరదాల పరదాల మీంచీ నడిచెళుతుంది

కాలమా

భాషకు నువు బంధీవి

కాలం చేసే గాయానికి

నువ్వే మందువి...


రచన

డా!! బాలాజీ దీక్షితులు పి.వి

8885391722

Tags:    

Similar News