Women Health : మహిళలు.. మానసిక ఆరోగ్యం.. ప్రభావితం చేస్తున్న రోజువారీ అంశాలివే..

Women Health : మహిళల మానసిక ఆరోగ్యం.. ప్రభావితం చేస్తున్న రోజువారీ అంశాలివే..

Update: 2024-10-16 12:31 GMT

దిశ, ఫీచర్స్ : వ్యక్తుల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో మానసిక ఆరోగ్యం కూడా కీలకంగా ఉంటోంది. అయితే ప్రస్తుతం విదేశాల్లో మాదిరి ఇండియాలో మెంటల్ హెల్త్‌ను అంత ప్రయారిటీ గల అంశంగా చాలా మంది భావించడం లేదనే అభిప్రాయాన్ని నిపుణులు సైతం వ్యక్తం చేస్తుంటారు. చాలా మంది ఫిజికల్ హెల్త్‌ గురించి మాట్లాడినంతగా, మెంటల్ హెల్త్ గురించి అంత ఓపెన్‌గా మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. పైగా తమ సమస్యలు బయటపెడితే ఇతరులు ఏమనుకుంటారోననే ఫీలింగ్ పలువురిని వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ సమస్యలను ఫేస్ చేస్తు్న్నవారిలో మహిళలే అధికంగా ఉంటున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి.

అసలు కారణం ఇదేనా?

ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఈటింగ్ డిజార్డర్ వంటివి ఎక్కువమందిని ప్రభావితం చేస్తుండగా.. వీరిలో మహిళలు మరింత ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఇవే సమస్యలు పురుషులు ఎదుర్కొంటున్నప్పుడు వారు బాధితులే అయినప్పటికీ ఆరోగ్యంపై మహిళలకంటే తక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అదే మహిళలు ఎదుర్కొంటున్నప్పుడైతే చుట్టు పక్కల జనాలు, సమాజం వీరిని హేళన చేస్తుందని, బాధిత మహిళలు అవమానాలు, అనుమానాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మహిళలు ఎదుర్కొనే మానసిక రుగ్మతల్లో పెరినాటల్ డిప్రెషన్, పెరి-మెనోపాసల్ డిప్రెషన్, ప్రీ మెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) వంటివి ఉంటున్నాయి.

హార్మోన్లలో మార్పులు కూడా..

స్త్రీలలో మానసిక రుగ్మతలకు మరో కారణం హార్మోన్లలో మార్పులు లేదా హెచ్చు తగ్గులు. వీటితోపాటు యంగ్ ఏజ్ మూడ్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, ప్రసవం, రుతుక్రమం ప్రారంభం, ఆగిపోయే ముందు, ఆగిపోయిన తర్వాత తదితర విషయాల్లో ప్రతికూల మార్పులు సంభవించినప్పుడు మహిళల్లో మెంటల్ డిజార్డర్లు పెరుగుతున్నాయి. ఇవన్నీ మానసిక అల్లకల్లోలానికి దారితీస్తున్న సమస్యలుగా ఈ సమాజంలో చాలామంది గుర్తించడం లేదని మహిళా వాదులు, వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధాలు, సవాళ్లు, బాధ్యతలు

రిలేషన్‌షిప్‌లో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, మానసిక సంఘర్షణలకు దారితీసే అవకాశం పురుషులతో పోలిస్తే మహిళల్లోనే అధికంగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. దీంతోపాటు పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పిల్లలను కనడం, చూసుకోవడం వీరిలో మానసిక, శారీరక మార్పులకు, సమస్యలకు దారితీసే అవకాశాలు అధికంగా ఉంటున్నాయి. పైగా ఆయా ఇబ్బందికర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభించకపోవడం, ఒంటరితనం వేధించడం, ఆరోగ్యం, కుటుంబం వంటి అంశాల్లో తమకు నచ్చిన విధంగా నడుచుకునే అవకాశం లేకపోవడం వంటి కట్టుబాట్లు మహిళల్లో మానసిక కల్లోలానికి కారణం అవుతుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

వేధింపులు, ఆర్థిక పరిస్థితులు

మహిళలను మానసికంగా కృంగదీసే ప్రధాన సమస్యల్లో గృహ హింస, లైంగి వేధింపులు, ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం లేదా సన్నిహితులు సూటిపోటి మాటలతో కామెంట్ చేయడం వంటివి మహిళల మెంటల్ హెల్త్‌పై ప్రభావం చూపుతున్నాయని సామాజిక వేత్తలు, మానసిక నిపుణులు కూడా చెప్తు్న్నారు. ఇవేకాకుండా ఇంటా బయట ఎదుర్కొనే పలు సమస్యలు స్త్రీలలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి రుగ్మతలకు దారితీస్తాయని కూడా పేర్కొంటున్నారు.

నిర్ణయాధికారం లేకపోవడం

ఇప్పటికీ అనేక మంది మహిళలు కుటుంబం, ఆర్థిక అంశాలే కాకుండా సొంత ఆరోగ్యంపై కూడా నిర్ణయాధికారం లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. స్త్రీలు బయటకు వెళ్లకూడదనే పితృ స్వామిక భావజాలంతో వారిని కుటుంబం కంట్రోల్ చేయడం, ఉపాధి, ఉద్యోగం వంటివి చేయకుండా అడ్డుకోవడం స్త్రీలలో ఆర్థిక స్థిరత్వం, సమానత్వం కోల్పోయేందుకు కారణం అవుతోంది. దీంతో వారు ఇతరులపై ఆధారపడాల్సి రావడం అవగాహన రాహిత్యానికి, సామాజిక అవగాహన లేమికి దారితీస్తోంది. క్రమంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎదుర్కొనే మార్గం తెలీక మానసిక సమస్యలకు దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు. అలాగే వివక్ష, చులకన భావం, సామాజిక అసమానతలు మహిళల్లో ఆందోళనకు, మానసిక రుగ్మతలకు దారితీస్తు్నాయి.

పరిష్కారం ఏమిటి?

అనేక కారణాలవల్ల మహిళలు మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎదుర్కొంటున్నప్పటికీ, వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందడం లేదు. మానసిక అల్ల కల్లోలానని ఆరోగ్య సమస్యగా పరిగణించకపోవడం, మూఢ నమ్మకాలు, మహిళలపట్ల చులకన భావం వంటివి వారి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. కాబట్టి వీటిని అర్థం చేసుకోవడం, సమస్యలు ఎదుర్కోవడంలో సహకరించడం వంటివి చేయాలి. అలాగే కుటుంబంలో, సమాజంలో మహిళల మానసిక ఆరోగ్యంపట్ల సపోర్టివ్ సిస్టం బిల్డ్ చేయడం, ట్రీట్మెంట్ పొందడంలో సహకరించడం, సమస్య నుంచి బయటపడే వరకు మద్దతుగా నిలువడం వంటివి నివారణ అంశాల్లో భాగంగా నిపుణులు పేర్కొంటున్నారు. 

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించ లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే మానసిక నిపుణులను సంప్రదించగలరు. 

Tags:    

Similar News