Heart Beat : స్త్రీలు, పురుషులు.. వీరిలో ఎవరి గుండె వేగంగా కొట్టుకుంటుంది..
గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దానిలో ఏ రకమైన లోపం వచ్చినా మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్ : గుండె మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. దానిలో ఏ రకమైన లోపం వచ్చినా మొత్తం శరీరానికి హాని కలిగిస్తుంది. గుండె గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో స్త్రీ, పురుషుల మధ్య ఎవరి గుండె వేగంగా కొట్టుకుంటుందో ముందుగా తెలుసుకుందాం. నిపుణుల ప్రకారం సగటున ఒక మహిళ గుండె పురుషుడి కంటే కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. సాధారణంగా ఒక మహిళ గుండె నిమిషానికి 70-85 బీట్ల వేగంతో కొట్టుకుంటుంది. అయితే మనిషి గుండె 60-80 వేగంతో కొట్టుకుంటుంది.
కార్డియాలజీ నిపుణులు ఏం చెబుతున్నారంటే సాధారణంగా పురుషుల కంటే మహిళల గుండె చప్పుడు ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఈ వ్యత్యాసం మహిళ గుండె చిన్నపరిమాణంలో ఉండడం వలన ఉంటుందంటున్నారు. అందుకే మహిళల గుండె కాస్త కష్టపడి పని చేయవలసి ఉంటుందంటున్నారు నిపుణులు. దీంతో పురుషుల కంటే స్త్రీల గుండె ఎక్కువగా కొట్టుకుంటుందంటున్నారు. గుండె ప్రతిరోజు సగటున 1 లక్ష సార్లు కొట్టుకుంటుందని, ఇది ఒక వ్యక్తి శరీరం అంతటా సుమారు 2,000 గ్యాలన్ల రక్తాన్ని పంప్ చేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. కానీ గుండె పనితీరులో ఏదైనా సమస్య ఏర్పడితే రక్తాన్ని పంప్ చేసే గుండె సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది గుండె వైఫల్యానికి కారణం కావచ్చంటున్నారు నిపుణులు.
గుండెకు సొంత విద్యుత్ వ్యవస్థ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనినే కార్డియాక్ కండక్షన్ సిస్టమ్ అంటారు. గుండె కార్డియాక్ కండక్షన్ సిస్టమ్‌లో ఏదైనా లోపం వల్ల కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చని చెబుతున్నారు. ఇది మరణానికి కారణమవుతుందని చెబుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ నివారించడానికి, ధూమపానం, మద్యపానం మానుకోవాలని చెబుతున్నారు. నవ్వడం కూడా గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. నవ్వడం వల్ల రక్త ప్రసరణ 20% పెరుగుతుందని చెబుతున్నారు. నవ్వడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందంటున్నారు నిపుణులు.
గుండె ఆరోగ్యాన్ని ఇలాగే చూసుకోండి..
గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, మీరు ప్రతిరోజూ వ్యాయామం చేయడం ముఖ్యం. దీనితో పాటు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కోసం మీ ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చండి. ప్రతి 6 నెలలకోసారి మీ గుండెను చెక్ చేసుకోవాలి. దీని కోసం లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలంటున్నారు నిపుణులు. మీకు అధిక రక్తపోటు లేదా మధుమేహం ఉంటే, వాటిని నియంత్రణలో ఉంచాలి. మద్యం సేవించవద్దు, మానసిక ఒత్తిడికి గురికావద్దంటున్నారు నిపుణులు.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.