Crazy emotions : అతి ధోరణులే అనర్థాలు.. ఈ రుగ్మతలను పెంచుతాయంటున్న నిపుణులు

Crazy emotions : అతి ధోరణులే అనర్థాలు.. ఈ రుగ్మతలను పెంచుతాయంటున్న నిపుణులు

Update: 2024-11-25 13:07 GMT

దిశ, ఫీచర్స్ : అతి నిద్ర పనికి చేటు, అతి ఆలోచనలు ఆరోగ్యానికి చేటు అంటుంటారు పెద్దలు. అంతే కాదు, ఈ రోజుల్లో అతి ధోరణులు, అతి స్పందనలు, అతి భావోద్వేగాలు కూడా అనర్థాలకు దారితీస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఏ దైనా ఒక విషయంలో పట్ల అవగాహన కలిగి ఉండటం వేరు. అవగతం చేసుకోవడం వేరు. సందర్భాన్ని బట్టి స్పందించడం వేరు. కానీ వీటన్నింటికీ భిన్నమైందే అతి ధోరణి. ఇది అతి భావోద్వేగాలకు దారితీసి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు ఇది బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఈ కోవకు చెందిందే అంటున్నారు నిపుణులు.

ఎలా స్వీకరిస్తారన్నదే ముఖ్యం

జీవితమన్నాక మంచీ చెడూ ఉంటాయి. సమస్యలూ సవాళ్లూ ఎదురవుతుంటాయి. వాటిని మీరెలా స్వీకరిస్తారు?, ఎలా స్పందిస్తారు? పరిష్కరించే విషయంలో ఎలా ఆలోచిస్తారు? అనే అంశాలపట్ల తగిన అవగాహన ఉన్నప్పుడు పెద్దగా భయం ఉండకపోవచ్చు. అది లేనప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అప్పుడు అతి ధోరణి, అతి భావోద్వేగం, అతి స్పందన వంటి హావ భావాలు, ప్రవర్తనలు కనిపిస్తుంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఇవి చివరకు మీపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే ‘అతి’ ఏ విషయంలోనూ మంచిది కాదంటారు నిపుణులు.

ఏం జరుగుతుంది?

అంతసేపూ సరదాగా, సంతోషంగా ఉన్న ఒక వ్యక్తి.. అకస్మాత్తుగా కోప్పడతారు. ఏదో తల్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తారు. తాము అనుకున్నది జరగకపోతే చాలు. అది పెద్ద విషయం కాకపోయినా, నష్టం చేయకపోయినా అతిగా ఆలోచిస్తారు. భావోద్వేగానికి లోనవుతారు. ఇక్కడే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కారణాలేమైనా అతి భావోద్వేగాలు, బాధలు మీలో భిన్నమైన ప్రవర్తనకు దారితీస్తాయి. చేసిందే చేయడం, చెప్పిందే చెప్పడం, ప్రతీ విషయానికి అతిగా స్పందించడం వంటి బిహేవియర్ గల బోర్డర్ లైన్ పర్సనాలిటికీ దారితీయవచ్చు అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. అందుకే ఆలోచన, ప్రవర్తన మీ అదుపులో ఉండేలా చూసుకోవాలనేది నిపుణుల సూచన.

రుగ్మతగా మారవచ్చు

వ్యక్తుల్లో అతి స్పందనలు, అతి ధోరణలు వంటి ప్రవర్తనలు వారిని ఎలా ప్రభావితం చేస్తాయన్న దానిపై 2015లో జరిగిన ఒక అధ్యయనం.. అది క్రమంగా బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్‌గా మారి, తర్వాత ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు గుర్తించారు. అంటే ఇక్కడ స్థిరమైన ఆలోచనలు లేకపోవడం కూడా ఇలాంటి రుగ్మతలకు దారితీస్తున్నాయి. కొన్నిసార్లు ఇవి సూసైడ్ థాట్స్‌కూ దారితీయవచ్చు.

లక్షణాలు

అతి ధోరణులకు సంబంధించిన ప్రవర్తనను అంచనా వేయడం కష్టం. కానీ ఆయా సందర్భాల్లో వ్యక్తుల ప్రవర్తనను బట్టి ఇది ఈజీగా తెలిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదామరణకు చిన్న దెబ్బ తగిలినా ఇక తాము చనిపోతామేమో అన్నంతగా ఆందోళన చెందుతారు కొందరు. బస్సులో, ట్రైన్‌లో వెళ్లేటప్పుడు దాని కదలికలకు కూడా భయపడతారు. ఎక్కడైనా బస్సు బోల్తా కొడుతుందేమోనని భయపడుతుంటారు. అలాగే బాధాకరమైన దృశ్యాలను, సంఘటనలను తల్చుకుని ఎక్కువగా బాధపడుతుంటారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రతీ దానికి టెన్షన్ పడుతుంటారు. కోపం, చిరాకు వంటివి వ్యక్తం చేస్తుంటారు. అలాగే స్ర్కీన్లకు ఎక్కువగా అతుక్కుపోవడం, మద్యం సేవించడం వంటి వ్యసనాన్ని కూడా కొందరు కలిగి ఉండవచ్చు.

పరిష్కారం ఏమిటి?

అతి ధోరణలు, అతి స్పందనలు, అతి భావోద్వేగాలను ‘బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్’ కు ముందు దశగా నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ప్రవర్తనలో అనూహ్య మార్పులు, ప్రతీ విషయానికి అతిగా స్పందించడం వంటివి గుర్తించినప్పుడు బాధిత వ్యక్తులపట్ల కుటుంబ సభ్యులు తగిన కేర్ తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వారిలో అతి ధోరణిని పెంచే పరిస్థితులకు, వస్తువులకు, తినబండారాలకు దూరంగా ఉంచాలి. విషయాలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే సైకాలజిస్టుల ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించవచ్చు. ఇలాంటి వాటికి ప్రస్తుతం ‘డయలెక్టివ్ బిహేవియరల్ థెరపీ’ వంటి పలు చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. 

Read More...

Mood Swings : పొద్దున్నే ఆ ఫీలింగ్ వేధిస్తోందా..? ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే!





Tags:    

Similar News