విటమిన్ బి6 అధిక మోతాదుతో నడక కోల్పోయిన వ్యక్తి
దిశ, ఫీచర్స్: శరీరానికి అవసరమైన ప్రధాన పోషకాల్లో 'విటమిన్ బి6' ఒకటి.
దిశ, ఫీచర్స్: శరీరానికి అవసరమైన ప్రధాన పోషకాల్లో 'విటమిన్ బి6' ఒకటి. అనేక అవయవాలకు ఎంతగానో ఉపకరించే ఈ విటమిన్‌ను పౌష్టికాహారం ద్వారానే పొందగలుగుతాం తప్ప బాడీలో సొంతంగా తయారుచేసుకోలేం. అలాగే 'బి6 విటమిన్'ను మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల ఒక వ్యక్తి ఏకంగా నడక సామర్థ్యాన్ని కోల్పోయాడు.
86 ఏళ్ల ఆస్ట్రేలియన్‌కు డాక్టర్లు రోజువారీ 50-మిల్లీగ్రాముల విటమిన్ బి6 తీసుకోవాలని ఈ ఏడాది ప్రారంభంలో సూచించారు. కానీ అతను సిఫార్సు చేసిన మోతాదు కంటే 70 రెట్లు అధికంగా తీసుకోవడంతో కాళ్లకు స్పర్శ జ్ఞానాన్ని కోల్పోయాడు. చివరకు పూర్తిగా నడవలేని స్థితికి చేరుకోవడంతో విటమిన్ బి6 టాక్సిసిటీగా నిర్థారణ అయింది. డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. 50 ఏళ్లు పైబడిన పురుషులకు సిఫార్సు చేయబడే బి6 మోతాదు 1.7 మిల్లీగ్రాములు. కానీ సదరు వ్యక్తి తృణధాన్యాలతో కూడిన అల్పాహారంలో బి6ను పరిమితికి మించి తీసుకున్నాడు. ఫలితంగా ఉండాల్సిన మోతాదు కంటే 70 రెట్లు అధికంగా కలిగిఉన్నట్లు తేలింది.
విటమిన్ బి6 ఎందుకంత కీలకం?
'విటమిన్ బి6 లేదా పిరిడాక్సిన్' అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది ఆహారంలో సహజంగా లభిస్తుంది. 'బి6'లో ఉండే ఎంజైమ్స్.. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, కొవ్వులను విచ్ఛిన్నం చేయడం వంటి శారీరక విధులను నిర్వర్తిస్తూ రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో సాయపడతాయి. మెదడు అభివృద్ధికి, నియంత్రణకు కూడా ఇది చాలా ముఖ్యమైంది. గర్భం-ప్రేరిత వికారం, మైకము, హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్స్ సహా అనేక వ్యాధులను నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ సహజంగా ట్యూనా, సాల్మన్, ఇతర కొవ్వు చేపలతో పాటు బలవర్థకమైన తృణధాన్యాలు, చిక్పీస్, గుడ్లు, బచ్చలికూర, కాలే, అరటి, నారింజ వంటి పదార్థాల్లో లభిస్తాయి.
విటమిన్ బి6 విషపూరితమా?
విటమిన్ బి6 విషపూరితం కావడాన్ని ఆరోగ్య నిపుణలు చాలా అరుదైన దృగ్విషయంగా పేర్కొన్నారు. అయినప్పటికీ అదనపు విటమిన్ మొత్తం శరీరంలోని మూత్రం ద్వారా బయటకు వెళ్లే క్రమంలో.. కాళ్లు, చేతులు, నరాల వ్యాధులు తలెత్తడంతో పాటు వాటిపై నియంత్రణ కోల్పోయేలా చేసి శారీరక కదలికల్లో సమస్యలు కలిగిస్తుంది. నిజానికి విటమిన్ బి6 తేలికపాటి లోపం ఎటువంటి సమస్యా కలిగించదు. కానీ కొన్నిసార్లు ఈ క్రింది లక్షణాలను ప్రదర్శిస్తుంది.
* రక్తహీనత
* దద్దుర్లు, పగుళ్లు వంటి చర్మ సమస్యలు
* డిప్రెషన్, ఆందోళన
* రోగనిరోధక శక్తి తగ్గుదల
* కిడ్నీ సమస్యలు
* పెద్దప్రేగు శోధము వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు