Donkey Marriage: గ్రాండ్‌గా గాడిదలకు పెళ్లి.. ఊరంతా కలిసి సెలబ్రేషన్స్
భారతీయ సంస్కృతిలో వివాహలకు వివిధ ఆచారాలు ఉన్నాయి. కులాలు, ప్రాంతాలు, తెగలను బట్టి ఆ ఆచారాలు మారుతుంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: భారతీయ సంస్కృతిలో వివాహలకు వివిధ ఆచారాలు ఉన్నాయి. కులాలు, ప్రాంతాలు, తెగలను బట్టి ఆ ఆచారాలు మారుతుంటాయి. అయితే ఈ వివాహాలు స్ర్తీ, పురుషుల మధ్యే జరుగుతాయని అనుకుంటే పొరబడినట్టే. ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రాచీన కాలం నుంచి మనుషులు, జంతువులు, పక్షులకు పెళ్లిలు జరుగుతున్నాయి. వీటిని పరిహారం పెళ్లి... మొక్కుల పెళ్లి అని కూడా అంటుంటారు. ఇంతకూ ఈ పెళ్లిళ్లు ఎందుకు చేస్తారంటే..
మానవ జీవనానికి వ్యవసాయం ఎంతో ముఖ్యం. వ్యవసాయం చేయాలంటే సరైన వర్షం ముఖ్యం. కానీ కొన్ని ప్రాంతాల్లో అతివృష్ఠి ఉంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో అనావృస్ఠి ఉంటుంది. ఈ కారణంగా వ్యవసాయానికి కష్టం అవుతుంది. దీంతో తమ ప్రాంతాల్లో సంవృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని వరుణదేవున్ని ప్రార్థిస్తూ ప్రజలు పూజలు చేస్తుంటారు. ఇందులో భాగంగా కప్పలకు పెళ్లి చేస్తుంటారు. లేదా చప్పట్లు కొడుతూ వర్షాలు కురవాలని పాటలు పడుతుంటారు. ఇలా ప్రాంతాలను బట్టి పూజలు చేస్తుంటారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని ఓ గ్రామంలో రెండు గాడిదలకు వైభవంగా పెళ్లి చేసి ఔరా అనిపించారు.
బెంగళూరుకు సమీపంలోని చిత్రదుర్గ జిల్లా దొడ్డ ఉల్లార్తి గ్రామానికి చెందిన ప్రజలు తమ ప్రాంతంలో వర్షాలు కురుస్తలేవని ఆందోళన చెందారు. తమ గ్రామ సమీపంలోని ఊర్లలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కానీ దొడ్డ ఉల్లార్తిలో ఒక్క చినుకు కూడా పడకపోవడంతో ఆవేదన చెందారు. వీరితో పాటు చల్లకెరె గ్రామంలోనూ వర్షం కురవలేదు. దీంతో సోమవారం ఉదయం ఆ రెండు గ్రామాల ప్రజలు గాడిదలను తెచ్చి.. వరుడిగా ఓ గాడిదను, వధువుగా మరో గాడిదను అందంగా ముస్తాబు చేశారు. ఆ తర్వాత గ్రామం నడిబొడ్డున అంగరంగా వైభవంగా వివాహం జరిపించారు. సంప్రదాయబద్దంగా పురోహితుడి వేద మంత్రాల ఉచ్ఛరణ మధ్య వివాహ తంతును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. విందు భోజనాలను ఏర్పాటు చేశారు. అయితే వర్షాలు కురవకపోతే ఇలా గాడిదలకు పెళ్లి చేయడం పురాతన కాలం నుంచి వస్తుందని అక్కడి ప్రజలు చెబుతుండటం గమనార్హం. మరి ఇప్పటికైనా వారి కోరికలు ఫలించి సంవృద్ధిగా వర్షాలు కురవాలని ఆశిద్దాం..